గ్యాస్ ఎఫెక్ట్.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్
ABN , Publish Date - Mar 27 , 2026 | 02:37 PM
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అధికమయ్యాయి.
మిగిలిన చోట్ల ఆహార పదార్థాల ధరల పెంపు
అంగన్‌వాడీలకూ తప్పని గ్యాస్ కష్టాలు
హిందూపురం(అనంతపురం): ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అధికమయ్యాయి. హిందూపురం పట్టణంలో కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేక వాటిపై ఆధారపడిన చిన్నచిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. దీని వలన పరోక్షంగా వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. బ్లాక్‌లో వాణిజ్య సిలిండర్ రూ.4 వేల దాకా కొంటున్నామంటూ కొన్ని హోటళ్లు యజమానులు అల్పహారం, భోజనం ధరలను ఇష్టానుసారంగా పెంచేశారు. దీంతో పట్టణంలో రోజువారి కూలీలు హోటళ్లలో భోజనం తినాలంటే జంకే పరిస్థితి నెలకొంది.
పలు హోటళ్లు బంద్
తగినంత గ్యాస్ సరఫరా లేకపోవడంతో పట్టణంలో పలు హోటళ్లను మూసేశారు. గత వారం రోజుల్లో హిందూపురంలో పదుల సంఖ్యలో తోపుడుబండ్లు, చిన్నాచితకా హోటళ్లతోపాటు కొన్ని పెద్ద హోటళ్లు సైతం మూతపడ్డాయి. దీని వలన మిగిలిన హోటళ్ల వారు ధరలను పెంచేశారు. కొన్ని హోటళ్లలో ప్లేటు ఉప్మా రూ30, మరికొన్ని చోట్ల రూ.40 ఉండేది. కానీ ప్రస్తుతం రూ.40 నుంచి రూ.60కి పెంచారు. ఇడ్లీలు కొన్ని చోట్ల ఒక ఇడ్లీ రూ. 10లు ఉండేది. మరికొన్నిచోట్ల రూ.25లకు రెండు ఇడ్లీ ఇచ్చేవారు. ప్రస్తుతం సింగిల్ ఇడ్లీ రూ.20, రెండు ఇడ్లీలు రూ. 40కి పెంచారు. మసాలా దోశ మొన్నటి వరకు రూ. 30లు ఉండేది. ప్రస్తుతం రూ. 50కి పెంచారు. అదేవిధంగా భోజనం హోటళ్లలో ఇదివరకు పుల్ భోజనం రూ. 100 ఉండేది. ప్రస్తుతం రూ.130 నుంచి రూ. 140కి పెంచారు. ఇక రాగి ముద్దతో పాటు హాఫ్ ప్లేటు భోజనం రూ50కు ఇచ్చేవారు. ఇప్పుడు దానిని రూ. 70లకు పెంచారు. ఇదేమని హోటళ్ల యజమానులను ప్రశ్నిస్తే వాణిజ్య సిలిండర్లు దొరకడం లేదని, తక్కువ ధరకు ఇస్తే మేము కూడా హోటళ్లను మూసుకోవాల్సి వస్తుందని సమాధానం చెబుతున్నారు.
అంగన్‌వాడీలకు గ్యాస్ కష్టాలు
ఇదిలా ఉంటే అంగన్‌వాడీ కేంద్రాలకు గ్యాస్ పంపిణీ చేయకపోవడంతో రెండు రోజులుగా పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు ఇళ్ల నుంచి భోజనం చేసుకొచ్చి చిన్నారులకు వడ్డిస్తున్నట్లు తెలిసింది. సిలిండర్లు అయిపోయాయని సూపర్‌వైజర్లను, టీడీపీ నాయకులను అడుగుతున్నా స్పందించలేదని, చేసేది లేక ఇళ్ల నుంచి తెస్తున్నామని, ఇలాగే అయితే కష్టంగా ఉంటుందని వారు వాపోతున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు
హోటళ్ల నిర్వాహకులు ఒక్క గ్యాస్ ధర పెరిగిందని, సగానికి సగం ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోధ్యం చూస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై తహసీల్దార్ వెంకటేశులును వివరణ కోరగా వాణిజ్య సిలిండర్ల సమస్య ఒకటి రెండు రోజుల్లో తీరనుందన్నారు. 20 శాతం వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచాలని కేంద్రం ఆదేశాలిచ్చిందని, గ్యాస్ కొరతను ఆసరా చేసుకొని హోటళ్లలో ధరలు పెంచితే చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు.
గ్యాస్ కొరత వల్లే హోటల్ మూసేశాం
వాణిజ్య సిలిండర్ దొరక్కపోవడంతో ఐదు రోజులుగా హోటల్ బంద్ చేశాము. గ్యాస్ కొరత ఇలాగే ఉంటే కట్టెల పొయ్యిలు ఏర్పా టు చేసుకోవాలి. ఎందుకంటే నా హోటల్‌పై 25 కుటుంబాలు ఆధారపడ్డాయి. వారికోసమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వరకు హోటల్ మూసేస్తాం. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల సమస్యను తొందరగా పరిష్కరించాలి.
-శ్రీనివాసులు, సింధూరి హోటల్ యజమాని
వారం నుంచి మూసేశాం..
గ్యాస్ కొరతతో వారం రోజులుగా హోటల్ మూసేశాం. రోజూ మా వద్ద అధిక సంఖ్యలో కార్మికులు హోటల్‌కి వచ్చేవారు. బ్లాక్‌లో సిలిండర్ కొనుగోలు చేసి ధరలు పెంచితే కూలి పని చేసేవారు ఇబ్బంది పడతారు. దాంతో ధర పెంచలేక హోటల్‌ని బంద్ చేశాం. గ్యాస్ పూర్తిస్థాయిలో వచ్చేవరకు తెరవం.
-వెంకటరెడ్డి, హోటల్ యజమాని
హోటల్లో ధరలు పెంచడం అన్యాయం
గ్యాస్ కొరత ఉందని హోటల్లో ఉన్నట్టుండి ధరలు పెంచడం సబబుకాదు. మాలాంటి ఆటో కార్మికులకు రోజువారి కూలి పనులు చేసేవారికి ధరలు ఇలా పెంచితే రోజంతా కష్టపడిన సొమ్మంతా హోటల్‌కే సరిపోతుంది.
-శేఖర్, ఆటోడ్రైవర్
ఈ వార్తలు కూడా చదవండి:
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News