రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:33 AM
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమృద్ధిగా ఉందని, కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.
పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్, మార్చి26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమృద్ధిగా ఉందని, కొరత లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. రాష్ట్రంలో సగటున రోజుకు 5,883 కిలో లీటర్ల పెట్రోలు, 7,348 కిలో లీటర్ల డీజిల్ సరఫరా అయ్యేదని, కానీ బుధవారం(మార్చి 25) ఒక్క రోజే 10,800 కిలో లీటర్ల పెట్రోలు, 11,328 లీటర్ల డీజిల్ సరఫరా చేసినట్టు వెల్లడించారు. రోజుకు 13,231 కిలో లీటర్లు సరఫరా చేయాల్సి ఉండగా...బుధవారం ఒక్క రోజే 22,127 కిలో లీటర్ల పెట్రోలు, డీజిల్ సరఫరా అయ్యాయని పేర్కొన్నారు. ఇక, ఈనెల 25 తేదీన(బుధవారం) మొత్తం 2,19,980 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో రోజుకు సగటున 2,15,151 సిలిండర్ల సరఫరా ఉంటుందన్నారు. ఐవోసీఎల్ 93,000 హెచ్‌పీసీఎల్ 75,151 సిలిండర్లు, బీపీసీఎల్ 47,000 సిలిండర్లు సరఫరా చేస్తుందన్నారు. అయితే, ప్రస్తుతం ఐవోసీఎల్ 92,799, హెచ్‌పీసీఎల్ 81,979, బీపీసీఎల్ 45,202 గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు అవసరం లేకుండా సిలిండర్ల ముందస్తు బుకింగ్ చేసుకోవద్దని ప్రజలకు సూచన చేశారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు 24 గంటల కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, ప్రజలు 1967కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.