Share News

GST Reduction: జీఎస్టీ తగ్గింపు.. సామాన్యులకు రిలీఫ్ కలిగించే కొత్త ఆలోచనలు

ABN , Publish Date - Sep 08 , 2025 | 11:24 AM

కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్‌లను ప్రకటించటంతో ఓరుగల్లు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అనేక వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

GST Reduction: జీఎస్టీ తగ్గింపు.. సామాన్యులకు రిలీఫ్ కలిగించే కొత్త ఆలోచనలు
GST Reduction

  • 10 శాతం తగ్గుతుండటంతో ప్రజల్లో హర్షాతిరేకాలు

  • బైక్‌పై రూ.60వేలు, కార్లపై రూ.1.50లక్షల వరకు తగ్గే అవకాశం

  • రెండు వారాలు కొనుగోలు వాయిదా వేసుకుంటున్న జనం

  • వ్యవసాయ ట్రాక్టర్లు, టైర్లు, పురుగు మందుల ధరలూ తగ్గింపు

  • కేంద్రం జీఎస్టీ కొత్త టారిఫ్ ప్రకటనతో గణనీయ మార్పులు

  • ఓరుగల్లులో భారీగా తగ్గిన కొనుగోళ్లు

  • ఈ నెల 22 నుంచి అమల్లోకి కొత్త జీఎస్టీ టారిఫ్

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్: కేంద్ర ప్రభుత్వం కొత్త జీఎస్టీ టారిఫ్‌లను (GST Reduction) ప్రకటించటంతో ఓరుగల్లు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నెల 22వ తేదీ నుంచి అనేక వస్తువులు, వాహనాలపై జీఎస్టీ భారం భారీగా తగ్గుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లను మరో రెండు వారాలు వాయిదా వేసుకుంటున్నారు. ప్రధానంగా వాహనాల కొను గోళ్లలో హైదరాబాద్ తర్వాత రెండోస్థానంలో ఉన్న వరంగల్‌లో.. కొత్త బుకింగ్‌లు భారీగా నిలిచిపోయాయి.


నిత్యావసర వస్తువులపై..

సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపై కూడా ప్రభావం కనపడనుంది. వీటితోపాటు వ్యవసాయరంగానికి సంబంధించిన ట్రాక్టర్లు, పురుగు మందులు, నీటిపారుదల శాఖకు సంబంధించిన మోటార్లు, విద్యకు సంబంధించిన పుస్తకాలు, ఇతర వాటిపై కూడా జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఉండనుంది. నిత్యావసర వస్తువులపై కూడా జీఎస్టీ తగ్గుతుండటంతో మధ్యతరగతి ప్రజలు సంతోషపడుతున్నారు. ఈ క్రమంలో 22వ తేదీ వరకు కొనుగోళ్లు నెమ్మదించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఓరుగల్లు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.


వాహన మార్కెట్‌పై ప్రభావం

కేంద్ర ప్రభుత్వం వివిధ వస్తువులు, వాహనాలు, నిత్యావసర సరుకులపై జీఎస్టీని భారీగా తగ్గించింది. ఈ మేరకు సెప్టెంబరు 3వ తేదీన కేంద్రప్రభుత్వం ప్రకటన చేసింది. దసరాకు పది రోజుల ముందు సెప్టెంబరు 22వ తేదీ నుంచే తగ్గించిన కొత్త జీఎస్టీ అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. దీంతో అత్యంత వెనుకబడిన జిల్లాగా ఉన్న ఓరుగల్లు ప్రజలకు ఊరట కలుగనుంది. ప్రధానంగా జీఎస్టీల తగ్గింపు ప్రభావం వాహన మార్కెట్‌పై తీవ్రంగా కనిపించనుంది. ప్రభుత్వం సెప్టెంబరు 3న కొత్త జీఎస్టీ శ్లాబులను ప్రకటించటంతో వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు ఆలోచనలో పడ్డారు. కొత్త జీఎస్టీలో 28శాతం నుంచి 18శాతానికి వాహనాలపై జీఎస్టీని తగ్గించారు. 10శాతం జీఎస్టీ తగ్గుతుండటంతో వాహనాలు కొనుగోలు చేసేవారు మరో రెండువారాలు నిరీక్షించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ తర్వాత వాహనాల విక్రయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా రెండోస్థానంలో ఉంది. మధ్యతరగతి ప్రజలు అధికంగా వినియోగించే 350 సీసీలోపు బైకులపై జీఎస్టీని ప్రభుత్వం 28శాతం నుంచి 18శాతానికి తగ్గించింది.


పదిశాతం జీఎస్టీ తగ్గుదలతో భారీగా ధరల్లో మార్పు కనిపిస్తుంది. అలాగే 100 సీసీ, అపై సామర్థ్యం ఉన్న బైకుల ధర రూ.1 లక్షకు పైగా ఉన్నాయి. ఇక ఇటీవల ఎక్కువ క్రేజీ ఉన్న ఎలక్ట్రికల్ బైక్‌ల ధర రూ.30 వేల నుంచి రూ.లక్షకుపైగా ఉన్నాయి. వీటిపై కూడా 10శాతం జీఎస్టీ తగ్గుదల ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతీనెల సుమారుగా 5వేలకు పైగా బైకులు విక్రయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన ద్విచక్రవాహనాలపై కనిష్టంగా రూ. 6 వేల నుంచి గరిష్టంగా సుమారు రూ.12.50 కోట్ల వరకు ధరలు తగ్గనున్నాయి. దీంతో ప్రతీనెల బైకులపై గరిష్టంగా సుమారు రూ 12.50కోట్ల వరకు వినియోగదారులకు పన్ను తగ్గింపుతో లబ్దిచేకూరే అవకాశం ఉంది.


డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రికల్ కార్లపై జీఎస్టీ ప్రభావం..

అలాగే డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రికల్ కార్లపై కూడా జీఎస్టీ ప్రభావం తీవ్రంగానే ఉంది. ప్రతీ నెల ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 600 నుంచి వెయ్యి వరకు ఆయా సీజన్లను బట్టి అమ్ముడుపోతున్నాయి. కార్లపై కూడా 28శాతం జీఎస్టీని 18శాతానికి తగ్గించారు. 10శాతం జీఎస్టీ తగ్గుదలతో కార్లపై కనిష్ఠంగా రూ.90వేల నుంచి రూ.1.50లక్షల వరకు ధరలు తగ్గనున్నాయి. ఈ లెక్కన కార్లపై నెలకు రూ. 6 కోట్లు నుంచి రూ.15కోట్ల వరకు జీఎస్టీ తగ్గింపుతో కొనుగోలుదారులకు లబ్ధిచేకూరే అవకాశం ఉందని అంచనా. మొత్తంగా జీఎస్టీ తగ్గింపుతో ప్రతిఏటా బైకులు, కార్ల కొనుగోళ్లపై సుమారుగా రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు వినియోగదారులపై జీఎస్టీ భారం తగ్గనుంది. ఈ మేరకు జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గనుంది. మొత్తానికి జీఎస్టీ తగ్గుదలతో వాహనరంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.


కేంద్రం ప్రకటనతో ప్రస్తుతం షోరూముల్లో బుకింగ్‌లు భారీగా తగ్గిపోయాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు మరో రెండు వారాలు ఆగితే తగ్గింపు ధర లభిస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే వాహనాలు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు షోరూమ్ నిర్వాహకులు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ముందుస్తుగా బుకింగ్ చేసుకుని 22వ తేదీ తర్వాతే డెలివరీ చేసుకోవచ్చునని ప్రకటిస్తున్నారు.


సెకండ్ హ్యాండ్ వాహనాలపై ప్రభావం..

కొన్ని కంపెనీలు 22వ తేదీ నాటికి వర్తించే జీఎస్టీనే తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. దీంతో ముందస్తుగా బుకింగ్‌పై కొనుగోలుదారులు అయోమయంలో పడిపోతున్నారు. మరోవైపు సెకండ్ హ్యాండ్ వాహనాలపై కూడా జీఎస్టీ తగ్గింపు తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాద్, కరీంనగర్ తర్వాత సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకంలో వరంగల్ మూడోస్థానంలో ఉంది. అయితే జీఎస్టీల తగ్గింపుతో సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోళ్లు భారీగా నిలిచిపోయాయి బైకులు, కార్లపై 10శాతం తగ్గింపు వస్తుండటంతో పాటు దసరా, దీపావళి ఆఫర్లను ఆయా కంపెనీలు ప్రకటిస్తుండటంతో చాలామంది కొత్త వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సెకండ్ హ్యాండ్ మార్కెట్ తీవ్ర నష్టాల వైపు చూస్తుందని నిర్వాహకులు వాపోతున్నారు.


మరికొన్నింటిపై తగ్గింపు.

అధిక ధరలతో ఆందోళన చెందుతున్న సామాన్యులకు కేంద్రం సవరించిన జీఎస్టీ భారం ఊరట కలిగిస్తుంది. ప్రధానంగా వస్తు సేవా పన్నుల కౌన్సిల్ ప్రతిపాదించిన విధానంలో కొత్తగా జీఎస్టీ మూడు స్లాబులుగా విభజించారు. పాత విధానంలో ఉన్న 12శాతం, 28శాతం స్లాబులను పూర్తిగా తీసివేస్తూ.. 5శాతం, 18శాతంతో పాటు విలాసవంతమైన వాటిపై 10శాతం జీఎస్టీని చేర్చుతూ కొత్త సంస్కరణలకు కేంద్రం తీసుకువచ్చింది. పేదలకు ఊరట కలిగించేలా నిత్యావసర వస్తులపై పన్నుల భారాన్ని భారీగా తగ్గించింది. ప్రధానంగా హెయిర్ ఆయిల్ షాంపులు, నెయ్యి, చీజ్, నామ్కిన్లు, వంట పాత్రలు, తదితర వాటిపై ఉన్న 12శాతం, 18శాతం జీఎస్టీని తగ్గించి 5శాతం జీఎస్టీ స్లాబులో చేర్చారు.


ఆరోగ్య జీవిత బీమాలపై..

అలాగే ఆరోగ్య జీవిత బీమాలపై గతంలో 18శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలిగించి జీరో జీఎస్టీగా మార్చటం కూడా ప్రజలకు ఊరట కలిగించేవే. అలాగే ఆరోగ్యానికి సంబంధించిన దయాగ్నస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్లు కళ్లద్దాలు కూడా జీరో జీఎస్టీ పరిధిలోకి రావటం మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరటగా చెబుతున్నారు. అలాగే విద్యకు సంబంధించిన మ్యాప్‌లు, పుస్తకాలు, క్రేయాన్‌లు, ఎరేజర్‌లు తదితర విద్య, విద్యార్థులకు సంబంధించిన వాటిపై గతంలో ఉన్న 5శాతం 12 శాతం జీఎస్టీని పూర్తిగా తొలగించి, జీరో జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం పేద విద్యార్థులకు ఊరట కలిగించే అంశం. ఇక వీటితోపాటు అనేక ఎలక్ట్రికల్ ఉత్పత్తులతో పాటు ఇతర నిత్యావసర వస్తువులపై జారీగా జీఎస్టీ తగ్గింపులు చేస్తుండటంతో 22వ తేదీ కోసం కొనుగోళుదారులు ఎదురు చూస్తున్నారు.


వ్యవసాయ రంగానికి ఉరట

జీఎస్టీల తగ్గింపు వ్యవసాయరంగానికి కొంత ఊరట కలిగించనుంది. ప్రధానంగా రాష్ట్రంలోనే వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. వ్యవసాయం యాంత్రీకరణ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ గతంలో 18శాతం, 12శాతం ఉండగా, ప్రస్తుతం 5శాతానికి తగ్గించారు. దీంతో ట్రాక్టర్లతో వ్యవసాయ సంబంధిత యంత్రాలపై భారీగా తగ్గింపులు రానున్నాయి. దీంతో పాటు పురుగుల మందులపై కూడా జీఎస్టీని 5శాతానికి కుదించారు. దీంతో రైతులకు పురుగుల మందులపై భారీగా లబ్ధిచేకూరనుంది. అలాగే నీటి పారుదల శాఖకు సంబంధించిన వ్యవసాయ మోటార్లు, పైపులు తదితర వాటిపై కూడా జీఎస్టీ 5శాతానికి తగ్గించారు. కొత్త జీఎస్టీతో రైతులకు కూడా భారీగా ఊరట కలిగించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్: మంత్రి తుమ్మల

For More TG News And Telugu News

Updated Date - Sep 08 , 2025 | 11:26 AM