Ramchandra Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 07:49 PM
కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాంచందర్ రావు జోస్యం చెప్పారు.
వికారాబాద్ జిల్లా, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఉద్యోగులను సైతం మోసం చేస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ఆరోపించారు. రాబోయే ఏ ఎన్నికలు అయినా బీజేపీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ(మంగళవారం) వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన తర్వాత మొదటి సారి వికారాబాద్ జిల్లాకు రాంచందర్ రావు వచ్చారు.
జిల్లా పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాంచందర్ రావుకు ఘనస్వాగతం పలికారు. ఆయనను గజమాలతో సన్మానించారు బీజేపీ శ్రేణులు. తేజ ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశంలో పాల్గొని రాంచందర్ రావు ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని రాంచందర్ రావు ధ్వజమెత్తారు. ప్రత్యామ్నాయంగా తెలంగాణలోని ప్రజలు నమ్మకంతో బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు రాంచందర్ రావు.
రైతు బంధు నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షలాది మంది రైతులకు ఏ ఒక్కసారి ఆపకుండా పీఎం కిసాన్ యోజన నిధులు జమ చేస్తున్నారని స్పష్టం చేశారు. రిటైర్‌మెంట్ డబ్బులు కూడా ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ఉద్యోగులు నేడు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ పాలన వైపు చూస్తున్నారని వెల్లడించారు. కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్
For More Telangana News and Telugu News..