CM Revanth Reddy: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్
ABN , Publish Date - Aug 19 , 2025 | 05:43 PM
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది తెలుగు ప్రజల ప్రతిష్టను పెంచే విధంగా తీసుకున్న నిర్ణయమని ఉద్ఘాటించారు.
హైదరాబాద్, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం హర్షణీయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) పేర్కొన్నారు. ఇది తెలుగు ప్రజల ప్రతిష్టను పెంచే విధంగా తీసుకున్న నిర్ణయమని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను ఎన్డీఏ కూటమి అపహాస్యం చేస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ దుర్వినియోగం చేస్తోందని ఫైర్ అయ్యారు. ఇవాళ(మంగళవారం) హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒకవైపు, రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తున్న ఎన్డీఏ కూటమి మరోవైపు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్న వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందని ఉద్ఘాటించారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు మద్దతుగా నిలవాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి గెలుపునకు చంద్రబాబు, కేసీఆర్, పవన్ కల్యాణ్, జగన్ కృషిచేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని సూచించారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ సభ్యుడు, ప్రతినిధి కాదని స్పష్టం చేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఏ పార్టీతో సంబంధం, అనుబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహారిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పుకొచ్చారు. బీసీ బిల్లు ఆమోదం పొందాలంటే న్యాయకోవిదుడు కీలక పదవిలో ఉండాలని సూచించారు. రాధాకృష్ణన్ గెలిస్తే.. బీసీలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని తెలిపారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నొక్కిచెప్పారు. ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని ఎంపీలందరికీ విజ్ఞప్తి చేశారు. ఇది తెలంగాణ వర్సెస్ తమిళనాడు కాదని వెల్లడించారు. రాజ్యాంగాన్ని రక్షించేవారికి, రాజ్యాంగాన్ని గౌరవించనివారికి జరిగే పోరాటమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
For More Telangana News and Telugu News..