Share News

CM Revanth Reddy: పదేళ్ల దోపిడీ ఇంకా చాల్లేదా కేసీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు

ABN , Publish Date - Dec 06 , 2025 | 04:45 PM

కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్‌ కార్డులు ఇవ్వాలనే ఆలోచనే చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్‌ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు.

CM Revanth Reddy: పదేళ్ల దోపిడీ ఇంకా చాల్లేదా కేసీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు
Telangana CM Revanth Reddy

నల్లగొండ, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): తమ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండుకళ్లుగా పాలన సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ప్రజాపాలన రెండేళ్లు పూర్తిచేసుకుంటున్నామని పేర్కొన్నారు. నిజాంలు, రజాకార్లను తరిమికొట్టిన ప్రాంతం నల్గొండ అని చెప్పుకొచ్చారు. గడీల పాలనను ప్రజలు తరిమికొట్టారని ప్రస్తావించారు.


కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్‌ కార్డులు ఇవ్వాలనే ఆలోచనే చేయలేదని విమర్శించారు. పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్‌ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇవాళ(శనివారం) నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం రేవంత్‌రెడ్డి.


కేసీఆర్‌ హయాంలో దొడ్డుబియ్యం..

‘కేసీఆర్‌ హయాంలో పేదలకు దొడ్డుబియ్యం ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ సన్నబియ్యం ఇవ్వట్లేదు. మా హయాంలో సన్నబియ్యం సరఫరా చేస్తున్నాం. పేదల ఆకలి తీర్చడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తానని మాట ఇచ్చి కేసీఆర్‌ మోసం చేశారు. యూపీఏ హయాంలో తెలంగాణలో 25 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పుడు తెలంగాణలో 4 లక్షలకు పైగా ఇళ్లు కడుతున్నాం. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో చెప్పాలి. కాంగ్రెస్‌ పాలనలో పేదలకు న్యాయం జరగుతుంది. కాంగ్రెస్‌ గెలిస్తే కరెంట్‌ ఉండదన్నారు. 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత మాదే. ఉచిత కరెంట్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌దే. పేదలంటే కేసీఆర్‌కు ఇష్టం ఉండదు. రైతులను కేసీఆర్‌ మోసం చేశారు’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.


ముంచే రోజులొస్తాయి..

‘మంచిరోజులు వస్తాయని కేసీఆర్‌ అంటున్నారు. పదేళ్ల దోపిడీ ఇంకా చాల్లేదా కేసీఆర్‌?. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే మనల్ని ముంచే రోజులొస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టింది గుర్తులేదా..? అయిన.. మీ కుమారుడే మీకు పెద్ద గుదిబండ. కేటీఆర్‌ ఉన్నంతకాలం బీఆర్ఎస్‌ను ప్రజలు బండకేసి కొడుతూనే ఉంటారు. కేసీఆర్‌ ఓడిపోయాకే ప్రజలకు మంచి జరిగిందని.. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలనూ కలవలేదు. ఫామ్‌హౌస్‌, ప్రగతి భవన్‌కు ఎవరినీ రానివ్వలేదు. ఇప్పుడు సర్పంచ్‌లు, వార్డు మెంబర్లనూ కలుస్తున్నారు. యువతకు 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం. భవిష్యత్‌లో మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీను కేసీఆర్‌ పదేళ్లపాటు పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ ఆగిందని మామ, అల్లుడు డ్యాన్సులు చేస్తున్నారు. ఎవరూ అడ్డుపడ్డా ఎస్‌ఎల్‌బీసీను పూర్తిచేసి తీరుతాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం

గాంధీ, నెహ్రూలపై బీజేపీ విష ప్రచారం.. జగ్గారెడ్డి ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2025 | 05:12 PM