Officials Relief Operations in Siddipet: బాబోయ్.. భారీ వర్షంతో సిద్దిపేట అతలాకుతలం
ABN , Publish Date - Aug 28 , 2025 | 04:04 PM
సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి, కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సిద్దిపేట, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నిన్న(బుధవారం) రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి (Heavy Rains) పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి, కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్త బస్టాండ్ నుంచి మోడరన్ బస్టాండ్ మధ్య, రోడ్డు వెంట, బ్రిడ్జిపైన నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి నీటి ఉధృతి తగ్గే వరకూ రాకపోకలు నిలిపివేయాలని, పోలీస్ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు కలెక్టర్ కట్టా హైమావతి.
శ్రీనగర్ కాలనీలో నీట మునిగిన ప్రాంతాన్ని ఒక ప్రైవేట్ అపార్ట్‌మెంట్ పైనుంచి వీక్షించి నీటమునిగిన కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలను తరలించడం కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి పునరావాస కేంద్రాల్లోకి మళ్లించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కట్టా హైమావతి.

కోమటిచెరువు మత్తడి నుంచి నీరు ఉధృతంగా వెళ్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే ఎన్‌సాన్‌పల్లి నుంచి కోమటి చెరువుకు నీరు వచ్చే కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతాన్నీ పరిశీలించారు. అలాగే శ్రీచైతన్య స్కూల్ ముందు భాగంలో ఉన్న కల్వర్టు నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాన్ని సైతం పరిశీలించారు. రోడ్ డ్యామేజ్ అయిన ప్రాంతంలో కోతకు గురికాకుండా ఇసుక బస్తాలు వేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ కట్టా హైమావతి.

శ్రీనివాస్ నగర్ కాలనీలో నీట మునిగిన ప్రాంతాన్ని, లోహిత్ సాయి ఆస్పత్రి పైనుంచి నర్సాపూర్ చెరువు నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే కింద ఉన్న నర్సాపూర్ చెరువు మత్తడి ప్రాంతాన్నీ సందర్శించి నీరు వేగంగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సహాయక చర్యలను ఏసీపీ రవీందర్, తహసీల్దార్ కిరణ్, పోలీస్ ఇతర శాఖల అధికారులు, తదితరులు పర్యవేక్షించారు.

ఈ వార్తలు కూడా చదవండి
స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం
తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్
Read Latest Telangana News and National News