Balapur Ganesh Mandapam ON Swarnagiri Theme: స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం
ABN , Publish Date - Aug 27 , 2025 | 07:08 PM
ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా బాలాపూర్ గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మండపం ప్రతిసారి ఒక కొత్త ఆలయ నమూనాలో నిర్మించడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత.
అమరావతి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా బాలాపూర్‌లోని గణేష్ మండపం (Balapur Ganesh Mandapam) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మండపం ప్రతిసారి ఒక కొత్త ఆలయ నమూనాలో నిర్మించడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకతగా నిలుస్తోంది. గతంలో కైలాసగిరి, బద్రినాథ్, రామేశ్వరమ్, అయోధ్య రాముని ఆలయం వంటి ప్రసిద్ధ ఆలయాలను నమూనాగా రూపొందించారు. ఈ ఏడాది స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (Swarnagiri Venkateswara Temple) నమూనాలో గణేష్ మండపాన్ని తీర్చిదిద్దారు.

46 సంవత్సరాల చరిత్ర...
శిల్పకళ, లైటింగ్, అలంకరణలతో భక్తులకు నిజమైన దేవాలయ వాతావరణాన్ని కలిగించేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి గణేష్ దర్శనంతోపాటు మండపం అందాలను భక్తులు తిలకిస్తున్నారు. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ప్రతి ఏటా ప్రత్యేకతగా నిలుస్తోంది. 1980లో ఒక అడుగుతో ప్రారంభించిన బాలాపూర్ గణేష్ ఈ సంవత్సరం 22 అడుగులకు చేరింది(కిరీటంతో సహా). కిరీటం లేకుండా అయితే 15 అడుగులు ఉంటుంది. 1994లో లడ్డూ వేలం ప్రారంభించారు. 46 సంవత్సరాల చరిత్ర బాలాపూర్ గణేష్‌కు ఉంది.

లడ్డూ స్పెషల్..
గత సంవత్సరం రూ.30లక్షల ఒక వెయ్యికి లడ్డూను దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. ఈసారి బాలాపూర్ గణేష్ ఆకారం పీటపై కూర్చొని చెవులు కదులుతూ శివపార్వతులు పక్కన దర్శనమిస్తారు. ఇవాళ(బుధవారం) సాయంత్రం 6 గంటలకు తొలిపూజా ప్రారంభించారు. ఈ ఏడాది ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ మండపంలోని స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామి ఆలయం నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏడు గంటల తర్వాత భక్తులకు బాలాపూర్ గణేష్ దర్శనమిచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాలతోపాటు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి బాలాపూర్ గణేష్‌ను దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి
వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు
పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
Read Latest Telangana News and National News