Security Breach At Parliament: పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:03 AM
పార్లమెంట్ వద్ద భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. పార్లమెంట్ భవనంలోకి గోడ దూకి లోపలికి ఆగంతకుడు చొరబడ్డాడు.అతడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 22: పార్లమెంట్‌లోని భద్రతా సిబ్బంది వైఫల్యం మరోసారి బహిర్గతమైంది. ఆగంతకుడు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి చొరబడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ రోజు.. అంటే శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి రైలు భవనం వైపునున్న చెట్టు ఎక్కి.. కొత్త పార్లమెంట్ భవనంలోని గరుడ గేట్ వద్ద కిందకి దూకి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది చూసి.. అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పార్లమెంట్ భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించి.. విచారిస్తున్నారు. పార్లమెంట్ వర్షా కాల సమావేశాలు ముగిసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ సమావేశాలు ఆగస్టు 21వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే.
గత ఏడాది సైతం ఈ తరహా ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి పార్లమెంట్ గోడ దూకి అనెక్స్ భవనం ఆవరణలోకి ప్రవేశించాడు. షార్ట్స్, టీ షర్ట్ ధరించిన ఆ యువకుడిని సీఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అతడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీష్‌గా గుర్తించారు. అతడి వద్ద ఎటువంటి ఆయుధాలు లభ్యం కాలేదు. అయితే అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు.
ఇక రెండేళ్ల క్రితం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న వేళ.. లోక్‌సభలో పబ్లిక్ గ్యాలరీలో కూర్చొన్న ఇద్దరు యువకులు ఆ తర్వాత సభలో దూకి సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారు. ఈ ఘటన పార్లమెంట్‌లోని భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది. అనంతరం పార్లమెంట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 2001, డిసెంబర్ 13వ తేదీ పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. ఈ అంశంపై చర్చ జరుగుతున్న రోజే.. ఈ ఆగంతకులు సభలోకి ప్రవేశించి గందరగోళం సృష్టించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
సరిహద్దు వివాదం.. కీలక నిర్ణయం: భారత్‌లో చైనా రాయబారి
గోదావరి - కావేరి అనుసంధానంపై కీలక భేటీ
For More National News And Telugu News