Telangana Districts Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:02 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల ధాటికి పలువురు గల్లంతయ్యారు. వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
మెదక్, ఆగస్టు27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల ధాటికి పలువురు గల్లంతయ్యారు. వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం.
మెదక్ జిల్లాలో చిక్కుకున్న 10 మంది..
మెదక్ జిల్లా వరదల్లో 10మంది చిక్కుకున్నారు. హవేలీ ఘనపూర్ వాగుకి భారీగా నీరు రావడంతో చూసేందుకు వెళ్లి వారంతా చిక్కుకుపోయారు. అదే బ్రిడ్జిపై సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. సీఎస్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలకు హెలికాప్టర్ పంపాలని కోరారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. వాతావరణం అనుకూలిస్తే పంపుతామని సీఎస్ రామకృష్ణరావు తెలిపారు. ఇప్పటికే మెదక్‌కు డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.
నక్కవాగులో కొట్టుకుపోయిన కారు..
అలాగే.. మెదక్ జిల్లాలోని హవేలి ఘనపూర్ మండలం నాగపూర్ నక్కవాగు ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులో ఎంత మంది ఉన్నారనేది వివరాలు తెలియాల్సి ఉంది. రాజ్ పేట వాగు నీటి ఉధృతికి ఓ ఆటో కొట్టుకుపోయింది. ఆటోలో ఉన్న ఇద్దరు బయటకు దూకి చెట్టును పట్టుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. హవేలీ ఘనపూర్ మండలంలో కారులో వెళ్తూ అందులో ఉన్న నరేందర్ గౌడ్ వాగులో చిక్కుకున్నారు. ఆయనను కాపాడటానికి రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. ఘటనా స్థలానికి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చేరుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఐదుగురు గల్లంతు..
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బొగ్గుగుడిసే వాగు ప్రవాహంలో ఎనిమిది మంది బిహారీ కూలీలు చిక్కుకున్నారు. వారిలో ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. మరో ముగ్గురు కోసం బోట్‌లో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు డీఈవో రేపు(గురువారం) సెలవు ప్రకటించారు. భారీ వర్షానికి తలమడ్లలో రైలు పట్టాల మీదుగా నీరు ప్రవహిస్తోంది. వర్షం ధాటికి రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో నాందేడ్ - మేడ్చల్ డెమో రైలు నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లాలో రెడ్ అలర్ట్ కొసాగుతోంది. రాజంపేటలో అత్యధికంగా 36 సెంటీమీటర్ల వర్షం పడింది. భిక్కనూర్‌లో 23, కామారెడ్డిలో 21, దోమకొండలో 20, మాచారెడ్డిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దోమకొండ మండల కేంద్రం నుంచి సంగమేశ్వర్ గ్రామానికి వెళ్లే మార్గంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారు చిక్కుకోవడంతో అందులో ఉన్న ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
సిరిసిల్ల జిల్లాలో ఐదుగురు గల్లంతు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులను వెంటనే ఆదుకునేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. ఘటనా స్థలికి వెళ్తున్నట్లు సిరిసిల్ల కలెక్టర్ చెప్పారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ వెల్లడించారు. అయితే, గంభీరావుపేటలో భారీ వర్షం పడుతోంది. అప్పర్ మానేరు నుంచి దిగువకు భారీగా నీటిని విడుదల చేశారు. మానేరు వాగులో పశువుల కాపరి నాగయ్య గల్లంతయ్యారు. వాగులో చిక్కుకున్న మరో ఐదుగురు రైతులను రక్షించేందుకు అధికారుల యత్నిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో పదివేల కోళ్లు మృతి..
సిద్దిపేట జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. మెదక్ జిల్లాలోని నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామానికి చెందిన ఓ పౌల్ట్రీ ఫారంలోకి వరద నీరు రావడంతో పదివేల కోళ్లు మృతిచెందాయి.
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి ప్రవాహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. 30.10 అడుగులు వద్ద 4,41,424 క్యూసెక్కులుగా వరద ప్రవాహం నమోదైంది.
యాదాద్రి జిల్లాలో ఉధృతంగా మూసీ
యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం బీమా లింగం కత్వా వద్ద రోడ్డు లెవల్ బ్రిడ్జి మీద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం నెలకొంది. బొల్లెపల్లి - సంగెం, చౌటుప్పల్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. అటువైపు ప్రజలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు
పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
Read Latest Telangana News and National News