Harish Rao: వైద్యం అందక విద్యార్థుల ఆవేదన.. రేవంత్ ప్రభుత్వం మౌనమెందుకు: హరీష్‌రావు
ABN , Publish Date - Aug 18 , 2025 | 08:56 PM
రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 మందికి పైగా విద్యార్థులు విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. విద్యార్థులను గురుకులంలోనే ఉంచి అరకొర వైద్యం అందించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అని హరీష్‌రావు ప్రశ్నించారు.
సంగారెడ్డి జిల్లా, ఆగస్టు18 (ఆంధ్రజ్యోతి): గురుకులాల్లో విష జ్వరాలు ప్రబలుతుంటే పరిష్కరించే ఆలోచన లేదు, జ్వరం వచ్చిన పిల్లలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న సోయి కూడా రేవంత్ ప్రభుత్వానికి ఎందుకు ఉండటం లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(X) వేదికగా ట్వీట్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు బంగారుమయం చేస్తానంటూ స్పీచులు దంచే రేవంత్ రెడ్డికి.. సంగారెడ్డి జిల్లా సింగూరు గురుకుల పాఠశాల విద్యార్థుల అవస్థలు కనిపించడం లేదా? అని నిలదీశారు మాజీ మంత్రి హరీష్‌రావు.
40 మందికి పైగా విద్యార్థులు విష జ్వరాలతో ఇబ్బంది పడుతుంటే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించకుండా రేవంత్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. విద్యార్థులను గురుకులంలోనే ఉంచి అరకొర వైద్యం అందించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇతర విద్యార్థులకు విష జ్వరాలు సోకే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే విద్యార్థులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో విష జ్వరాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు.
కాంట్రాక్టర్లు ధర్నా ..
రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం రెండు సార్లు సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసే స్థితి రావడం దేశంలో ఇదే మొదటిసారి కావచ్చని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. మొన్న కమీషన్లు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేయడం లేదని కాంట్రాక్టర్లు సచివాలయంలోని ఆర్థిక మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారని గుర్తుచేశారు. నేడు అదే సచివాలయం సెకండ్ ఫ్లోర్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఎదుట కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా చేశారని చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో సీనియారిటీ పాటించకుండా, కమీషన్లు దండుకుంటున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా? లేక స్కాంగ్రేస్ ప్రభుత్వమా? అని ఎద్దేవా చేశారు. ఒక మిషన్ లేదు, విజన్ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది ఒక్కటే.. టార్గెట్ కమీషన్! అని సెటైర్లు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే ప్రజలంతా ఏకమై ఎక్కడిక్కడ నిలదీస్తారు... తస్మాత్ జాగ్రత్త అని హరీష్‌రావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం, ఇంట్లో ఒంటరిగా ఉన్న పన్నెండేళ్ల బాలిక హత్య
కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి
Read latest Telangana News And Telugu News