Share News

KTR Meets Bandi Sanjay: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఎదురుపడ్డ ప్రత్యర్థులు.. ఆ తర్వాత జరిగింది ఇదే..

ABN , Publish Date - Aug 28 , 2025 | 07:34 PM

సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అయితే ఈ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నర్మాల ప్రాజెక్ట్ దగ్గరకు కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ ఒకే సమయంలో వచ్చారు.

KTR Meets Bandi Sanjay: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. ఎదురుపడ్డ ప్రత్యర్థులు.. ఆ తర్వాత జరిగింది ఇదే..
KTR Meets Bandi Snajay

కామారెడ్డి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పరిశీలించారు. అయితే ఈ సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నర్మాల ప్రాజెక్ట్ దగ్గరకు కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ (Bandi Snajay) ఒకే సమయంలో వచ్చారు. ఈ సందర్భంగా నేతలు ఒకరినొకరు పలకరించుకున్నారు. బండి సంజయ్‌‌కు కేటీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పరస్పరం అభివందనం చేసుకున్నారు కేటీఆర్, బండి సంజయ్. ఘాటు వ్యాఖ్యలతో విమర్శించుకునే రాజకీయ ప్రత్యర్థులు ఒకేసారి ఎదురుపడడంతో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.


రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేదు: కేటీఆర్

మరోవైపు.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలోని వరద ప్రభావిత ప్రాంతాలను కేటీఆర్ పరిశీలించారు. సిరిసిల్ల నర్మాల ప్రాజెక్ట్ పర్యటనను ముగించుకుని మాచారెడ్డి మండలానికి కేటీఆర్ వచ్చారు. పాల్వంచ వాగు ఉధృతి, తెగిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు తెగిపోవడంతో కామారెడ్డి వైపు రాకపోకలు నిలిచిపోవడంతో పాల్వంచ నుంచి తిరిగి సిరిసిల్లకు కేటీఆర్ వచ్చారు. పాల్వంచ వాగు వరదతో జన జీవనానికి ఏర్పడిన ఆటంకాలపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా లేదని విమర్శించారు. వర్షాలతో ప్రజలు నష్టపోతుంటే మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేస్తారా? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు, ఎకరా పంటకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


సిద్దిపేట పట్టణంలో భారీ వర్షం

అలాగే.. సిద్దిపేట పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో హరీష్‌రావు మాట్లాడారు. సిద్దిపేటలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం పడిందని తెలిపారు. తొగుట మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని వెల్లడించారు. 20 ఏళ్లలో ఎప్పుడూ ఇంతగా వర్షం పడలేదని చెప్పుకొచ్చారు. భారీ వర్షం వల్ల సిద్దిపేటలో పలు కాలనీలు జలమయం అయ్యాయని వివరించారు హరీష్‌రావు.


సిద్దిపేటలో వచ్చిన వరదను తగ్గించడానికి నర్సాపూర్ చెరువుకు ఒక మీటర్ గండి కొట్టామని హరీష్‌రావు వెల్లడించారు. నర్సాపూర్ చెరువు నీటిని శనిగరం మందపల్లి వైపునకు మళ్లించామని తెలిపారు. భవిష్యత్తులో వరద వచ్చినపుడు ఎలా తట్టుకోవాలనే విషయంపై నిపుణులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మళ్లీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి వచ్చినా ఇబ్బంది పడకుండా పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా సహకరించాలని.. నాళాలు కబ్జాలు చేసి సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు కట్టడంతో ఇబ్బంది వస్తోందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు తక్కువ ధరకు వస్తున్నాయని.. ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మించుకోకూడదని హరీష్‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

స్వర్ణగిరి ఆలయ థీమ్‌తో బాలాపూర్ గణేష్ మండపం

తెలంగాణలో భారీ వర్షాలు.. జిల్లాల వారీగా హై అలర్ట్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 28 , 2025 | 08:07 PM