Share News

Telangana High Court: కాళేశ్వరం నివేదిక.. హై కోర్టులో వాడివేడిగా వాదనలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 03:47 PM

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై వేసిన పిటిషన్లపై తెలంగాణ హై కోర్టులో గురువారం విచారణ జరిగింది. రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది. ఐదు అంశాలను ప్రేయర్‌గా పిటిషనర్లు పేర్కొన్నారు.

Telangana High Court:  కాళేశ్వరం నివేదిక.. హై కోర్టులో వాడివేడిగా వాదనలు
Telangana High Court

హైదరాబాద్,ఆగస్టు21 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు (Harish Rao) కాళేశ్వరం కమిషన్ నివేదికపై (Kaleshwaram Commission Report) వేసిన పిటిషన్లపై తెలంగాణ హై కోర్టులో (Telangana High Court) ఇవాళ(గురువారం) విచారణ జరిగింది. రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించింది. ఐదు అంశాలను ప్రేయర్‌గా పేర్కొన్నారు పిటిషనర్లు. కేసీఆర్ తరఫున వాదనలను సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వినిపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కేసీఆర్, హరీష్‌రావు కోరారు. కాళేశ్వరం కమిషన్‌‌ను నియమిస్తూ గత ఏడాది జీఓను కొట్టేయాలని కేసీఆర్, హరీష్‌రావు కోరారు. తమకు కమిషన్ నివేదికను ఇవ్వలేదని కేసీఆర్, హరీష్‌రావు పేర్కొన్నారు. కమిషన్ విచారణ సమయంలో యాక్ట్ సెక్షన్ 8బీ, 8సీ నోటీసులు ఇవ్వలేదని పిటిషన్‌లో సుందరం తెలిపారు.


ఎలాంటి ఆధారాలు లేవు.. కేసీఆర్ తరఫు న్యాయవాది సుందరం

కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పిటిషన్‌లో సుందరం వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్‌ని అప్రదిష్టపాలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోదని పిటిషనర్ తరుపు న్యాయవాది సుందరం తెలిపారు. రాజకీయ వ్యూహంతోనే జస్టిస్ గోష్ కమిషన్ నియామకం జరిగిందని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని వివరించారు. దురదృష్టవశాత్తూ వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పిల్లర్ కుంగిందని.. వర్షాకాలంలో అకాల వర్షాలు కారణంగా కూలిందని తెలిపారు. కుంగిపోవడానికి డిజైనింగ్ కానీ ఇంజనీరింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల తరుపు న్యాయవాది సుందరం స్పష్టం చేశారు. నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు అందజేయడంలో దురుద్దేశం ఉందని సుందరం చెప్పుకొచ్చారు. సాధారణ ప్రజల్లో తమ పరువును అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని సుందరం తెలిపారు.


నోటీసులు సరిగా ఇవ్వలేదు..కేసీఆర్ తరఫు న్యాయవాది సుందరం

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని న్యాయవాది సుందరం తెలిపారు. నోటీసులు సరైన విధానంలో ఇవ్వలేదని వాదించారు. నివేదికను కూడా కేసీఆర్, హరీష్‌రావుకు అందించలేదని న్యాయవాది సుందరం వెల్లడించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని సుందరం తెలిపారు. రాజకీయంగా నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారని అన్నారు. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. పిటిషనర్లు కేసీఆర్, హరీష్‌రావు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు.


అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిపై హై కోర్టు ప్రశ్నల వర్షం..

అలాంటప్పుడు నివేదికను ఎందుకు బయట పెట్టారని ప్రభుత్వాన్నిహైకోర్టు ప్రశ్నించింది. మీడియా సమావేశంలో ప్రతి జర్నలిస్టుకు 60 పేజీల నివేదిక అందజేశారని సుందరం తెలిపారు. న్యాయస్థానానికి సమర్పించిన కాపీలు సరిగ్గా కనిపించడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నివేదిక కాపీలు సరిగ్గా కనిపించేలా ఇస్తే తర్వాత విచారణ చేస్తామని తెలిపింది. కేసు ప్రాధాన్యత దృష్ట్యా ఈరోజే విచారణ కొనసాగించాలని కేసీఆర్ తరుపు న్యాయవాది సుందరం కోరారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక అధికారికంగా విడుదల చేశారా అని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిని హైకోర్టు మూడు ప్రశ్నలు వేసింది. నివేదిక కాపీను పబ్లిక్ డొమైన్‌లో పెట్టారా..? పిటిషనర్లకు 8బీ కింద నోటీసులు ఇచ్చారా లేదా..? కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటి..? అని హైకోర్టు ప్రశ్నించింది. తాము ఇచ్చిన నోటీస్ 8బీ నోటీస్ అని న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ తెతెలిపారు.సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రానా అది 8 బీ నోటీస్ కాదంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సిందేనని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి పట్టుబట్టారు. కిరణ్‌భేడీ కేస్‌కి ఈ కేస్‌కు తేడాలు ఉన్నాయని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు.


కాళేశ్వరం రిపోర్టును పబ్లిక్ డొమెన్‌లో పెట్టలేదు.. ఏజీ క్లారిటీ..

కాళేశ్వరం రిపోర్టును తాము ఎక్కడ పబ్లిక్ డొమెన్‌లో పెట్టలేదని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్‌లో పెడతామని స్పష్టం చేశారు. కౌంటర్‌లో మరిన్ని వివరాలు పొందపరుస్తామని వివరించారు. ఈ స్టేజిలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని హైకోర్టును ఏజీ కోరారు. అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోరారు. సెక్షన్ 8బీ కింద కాకుండా ఏ సెక్షన్ కింద నోటీసులిచ్చారా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్ నివేదిక ప్రస్తుతం ఏ దశలో ఉందని ఏజీని హైకోర్టు అడిగింది. ప్రజాధనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కమిషన్‌ను ప్రభుత్వం వేసిందని ఏజీ తెలిపారు. కమిషన్ నివేదికను కేబినెట్ సులభంగా అర్థం చేసుకునేలా 60పేజీల నివేదిక రూపొందించారని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు.


అసెంబ్లీలో చర్చించి తదుపరి చర్యలు..ఏజీ సుదర్శన్ రెడ్డి

60పేజీల నివేదిక ఆధారంగా ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించిందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో చర్చించి తదుపరి చర్యలు తీసుకునేలా కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏజీ వివరించారు. అసెంబ్లీలో చర్చించే వరకు ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టవద్దని ఏజీ సూచించారు. ఈ పిటీషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఏజీ కోరారు. సెక్షన్ 8బీ కింద నోటీసులు ఇవ్వలేదని పిటీషనర్లు తప్పుపట్టడం చెల్లదని ఏజీ పేర్కొన్నారు. ఏజీని మరోసారి హైకోర్టు ప్రశ్నించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు..? అని అడిగింది. ఈ నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా..?అని ప్రశ్నించింది. అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా..? అని నిలదీసింది. రేపు లేదా సోమవారం సమాచారం తెలుసుకుంటానని ఏజీ తెలిపారు. అయితే ఈ విచారణ రేపటికి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

శ్రీశైలంలో కుట్రలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

యూరియాతో రాజకీయాలు చేస్తున్నారు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2025 | 05:30 PM