Share News

KTR VS Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:38 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

KTR VS  Bandi Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఎందుకంటే
KTR VS Bandi Sanjay

హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు (Bandi Sanjay) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ఇవాళ (మంగళవారం) లీగల్ నోటీసులు (Legal Notices) పంపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమైనవని, అవి తన ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో చేసినవని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల(ఆగస్టు) 8వ తేదీన బండి సంజయ్ నిర్వహించిన పత్రికా సమావేశంలో చేసిన ఆరోపణలపై కేటీఆర్ ఈ నోటీసులను పంపించారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, దురుద్దేశ పూరితమైనవని కేటీఆర్ తరఫు న్యాయవాదులు నోటీసులో తెలిపారు. బండి సంజయ్ తన హోదాను దుర్వినియోగం చేస్తూ, ప్రజల్లో తన ప్రతిష్ఠను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్.


కేవలం రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు అడ్డగోలు ప్రాపగండ చేస్తున్న బండి సంజయ్ పదేపదే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బండి సంజయ్ ఆరోపణలతో తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోపాటు ఆ తర్వాత మంత్రిగా తాను అనేక రంగాల్లో అద్భుతమైన సేవలు అందించానని చెప్పుకొచ్చారు. అయితే కేంద్రమంత్రి పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో తన క్లైంట్ కేటీఆర్ పరువుకి భంగం కలుగుతుందని నోటీసులో న్యాయవాదులు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో బండి సంజయ్ చేసిన ఏ వ్యాఖ్యలకూ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని, ఒక పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా బాధ్యత కలిగిన పదవుల్లో ఉండి మరొక శాసనసభ్యుడుపై అసత్య పూరిత అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులో కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు.


బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, ఇవి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారని నోటీసులో వెల్లడించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. కేటీఆర్ అతని కుటుంబసభ్యులపై భవిష్యత్తులో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని నోటీసులో కోరారు. నోటీసులు అందిన ఏడు రోజుల్లోగా ఈ డిమాండ్లను పాటించని పక్షంలో, చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆరోపణలతో కలిగిన నష్టానికి బండి సంజయ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని కేటీఆర్ న్యాయవాదులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షం.. నిండుకుండల్లా ప్రాజెక్టులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2025 | 01:35 PM