Share News

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 06:58 AM

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని వెల్లడించారు.

 Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు
Heavy Rains in Telangana

హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.


కాగా, గ్రేటర్ హైదరాబాద్‌లో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజాము నుంచీ భారీ వర్షం కురుస్తోంది. మలక్‌పేట, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, ఓయూ, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, కాప్రా, హకీంపేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టౌలీచౌకి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. వాన పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్థంభించింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది.


జిల్లాల్లో భారీ వర్షం..

అలాగే, పలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించారు. 40 కిలోమీటర్ల కంటే తక్కువ గాలులతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. వరంగల్, హన్మకొండ, జిల్లాల్లో మోస్తరు వర్షం పడుతోందని తెలిపారు. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల మధ్య గరిష్ఠ ఉపరితల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


వరంగల్‌లో భారీ వర్షం

వరంగల్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు కాలనీలు జలమయమయ్యాయి. సాకరాశికుంట, హనుమాన్ నగర్, పెరుకవాడ, ఏకశిలా నగర్ ప్రాంతంలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. వర్షం నీటికి ఇంట్లో ఉన్న సామగ్రి తడిసిపోయాయి. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను కాలనీ వాసులు కోరుతున్నారు.


భారీ వర్షాలు నమోదు...

కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనిపర్తిలో 21.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా సంగెంలో 18.7 సెంటీమీటర్లు, ఉర్సులో 14.8 సెంటీమీటర్లు, వర్ధన్నపేటలో 12.2 సెంటీమీటర్లు, కల్లెడలో 11.2 సెంటీమీటర్లు, కాశీబుగ్గలో 11.1 సెంటీమీటర్లు, గొర్రెకుంటలో 10.5 సెంటీమీటర్లు, ఏనుగల్లులో 10.2 సెంటీమీటర్లు, నెక్కొండలో 9.8 సెంటీమీటర్లు, చెన్నారావుపేటలో 8.6 సెంటీమీటర్లు, రాయపర్తిలో 8.2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా వడ్డేకొత్తపల్లిలో 11.9 సెం.మీ, తొర్రూరులో 10.4 సెం.మీ వర్షపాతం రికార్డు అయింది. జనగామ జిల్లా కొడకండ్లలో 11.9 సెం.మీ, జఫర్‌గడ్‌లో 9.1 సెం.మీ, దేవరుప్పులలో 8.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లా కాజీపేటలో 10.7 సెం.మీ, ములుగు రోడ్డులో 10.1 సెం.మీ, ఐనవోలులో 8.3 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.


పొంగిపొర్లుతున్న వాగులు..

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం బావాయిపల్లి, ఖానాపూర్, పసుపుల గ్రామాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామస్తులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాగులపై వంతెనలు నిర్మించాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రేవంత్‌పై దాఖలైన అట్రాసిటీ కేసులో పిటీషనర్‌కు సుప్రీం చురకలు

హైదరాబాద్‌లో ఘరానా మోసం.. దొంగ స్వామీజీ బురిడీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 12 , 2025 | 09:36 AM