Share News

Jagga Reddy: హామీలపై చర్చకు సిద్ధమా.. కిషన్‌రెడ్డికి జగ్గారెడ్డి స్ట్రాంగ్ ఛాలెంజ్

ABN , Publish Date - Dec 21 , 2025 | 07:24 PM

సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఏపీలో మోదీ జీరో అని ఎద్దేవా చేశారు. మోదీ హామీలపై, కాంగ్రెస్ హామీలపై కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధమా..? అని ఛాలెంజ్ చేశారు.

Jagga Reddy: హామీలపై చర్చకు సిద్ధమా.. కిషన్‌రెడ్డికి జగ్గారెడ్డి స్ట్రాంగ్ ఛాలెంజ్
Jagga Reddy

హైదరాబాద్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీకి (Sonia Gandhi) కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఇటీవల ఓ లేఖ రాశారు. ఈ విషయంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో జగ్గారెడ్డి సూటి ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు. సోనియాకి లేఖ రాసిన కిషన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీలపై ప్రధానికి ఎందుకు లేఖ రాయలేదు..? అని ప్రశ్నించారు. మోదీని ప్రశ్నించలేని కిషన్‌రెడ్డి లేఖకు వాల్యూ లేదని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు జగ్గారెడ్డి.


బీజేపీకి అవకాశమిస్తే విదేశాల్లో ఉన్న నల్లధనం తెస్తామని మోదీ అన్నారని ప్రస్తావించారు. దేశంలో ఉన్న పేదలకు ఒక్కొక్కరికీ రూ. 15 లక్షలు ఇస్తామని అన్నారని గుర్తుచేశారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని .. 11 ఏళ్లు అయినా ఆయన ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ, ఏపీలో మోదీ జీరో అని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని విమర్శించారు జగ్గారెడ్డి.


కాంగ్రెస్ ఏం చేసిందో తాను చెబుతానని అన్నారు. సోనియా గాంధీ హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. రైతు భరోసాలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. వరి పంటకు రూ.500లు బోనస్ ఇస్తున్నామని.. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇచ్చే పథకం ప్రాసెస్‌లో ఉందని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి.


కౌలు రైతులను గుర్తించే పనిలో తమ ప్రభుత్వం ఉందని అన్నారు. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని వివరించారు. ఇళ్ల స్థలాలు లేని దగ్గర రైతుల నుంచి భూమి కొని పేదలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామని పేర్కొన్నారు.


రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షలకు పెంచామని అన్నారు. రూ.4000ల పెన్షన్ కోసం డబ్బులు సమకూర్చుకుంటున్నామని తెలిపారు. ఇచ్చినవి చెబుతున్నాం... ఇవ్వనివి కూడా క్లారిటీగా చెబుతున్నామని వివరించారు. సన్నబియ్యం, రేషన్ కార్డులు ఇస్తున్నామని... తాము చెప్పిన దాంట్లో రెండేళ్లలో 70 శాతం అమలు చేశామని చెప్పుకొచ్చారు. మోదీ చెప్పిన రెండు హామీల్లో 11 ఏళ్లు గడిచినా ఇంకా దిక్కు లేదని మండిపడ్డారు. మోదీ హామీలపై, కాంగ్రెస్ హామీలపై కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చర్చకు సిద్ధమా? అని ఛాలెంజ్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలో ఇచ్చిన 13 హామీల్లో 10 హామీలు పూర్తి చేశామని స్పష్టం చేశారు. వంద రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్న మోదీ 11 ఏళ్లు గడిచినా ఎందుకు చేయలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నన్ను తిట్టడం.. అవమానించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానం

అందుకే కేసీఆర్ బయటకు వచ్చారు.. మధుయాష్కీ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2025 | 07:36 PM