CP CV Anand ON Ganesh Immersion: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సక్సెస్ ఫుల్‌గా నిర్వహించాం: సీవీ ఆనంద్
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:50 PM
పోలీసులు రెండు రోజుల పాటు నిద్ర లేకుండా గణనాథుల శోభాయాత్రలో బందోబస్తు చేశారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సమన్వయంతో అనుకున్న సమయం కంటే ముందే నిమజ్జనం పూర్తి చేశామని వివరించారు. పదిరోజులుగా గణేశ్ మండపం నిర్వాహకులను ఒప్పించి ఈ ఏడాది ముందుగానే వినాయకుల విగ్రహాలను తీయించామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబరు7 (ఆంధ్రజ్యోతి): గణేశ్ నిమజ్జన శోభాయాత్ర (Ganesh Immersion) నిన్న(శనివారం) ఉదయం 6.30గంటలకు ప్రారంభమైందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ (CP CV Anand) పేర్కొన్నారు. ఇంకా 900 వినాయక విగ్రహాల నిమజ్జనం అవ్వాల్సి ఉందని చెప్పుకొచ్చారు. చిన్న గణేశ్ విగ్రహాలను కలుపుకొని ఈరోజు 25 వేల విగ్రహాలు నిమజ్జనం అవ్వాలని తెలిపారు. 40 గంటల పాటు నిమజ్జన శోభాయాత్ర జరిగిందని వివరించారు. 12,034 విగ్రహాలు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు. 6,300 విగ్రహాలు నిన్నటి వరకు నిమజ్జనం అయ్యాయని తెలిపారు. ఇవి కాకుండా లక్ష 20 వేల విగ్రహాలు హైదరాబాద్‌లోని బేబీ పాండ్స్, ఇతర చెరువుల్లో నిమజ్జనం అయ్యాయని పేర్కొన్నారు సీవీ ఆనంద్.
లక్షా 40 వేల గణేశ్ విగ్రహాల నిమజ్జనం..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం లక్షా 40 వేల గణనాథుల విగ్రహాలు నిమజ్జనం అయినట్లు జీహెచ్ఎంసీ చెబుతోందని అన్నారు. పోలీసులు రెండు రోజుల పాటు నిద్ర లేకుండా బందోబస్తు చేశారని తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సమన్వయంతో అనుకున్న సమయం కంటే ముందే నిమజ్జనం పూర్తి చేశామని వివరించారు. పదిరోజులుగా గణేశ్ మండపం నిర్వాహకులను ఒప్పించి ఈ ఏడాది ముందుగానే వినాయకుల విగ్రహాలను తీయించామని చెప్పుకొచ్చారు. ముందు సౌత్ జోన్ విగ్రహాలు తీయించామని వెల్లడించారు. అక్కడ సెన్సిటివ్ ప్రాంతాలు ఉన్నాయని.. లా అండ్ ఆర్డర్ సమస్యతో ముందు సాత్ జోన్‌లో గణనాథుల విగ్రహాలను నిమజ్జనానికి తరలించామని తెలిపారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాల విగ్రహాలను తీయించి నిమజ్జనం చేయించామని పేర్కొన్నారు సీవీ ఆనంద్.
సీఎం రేవంత్ సర్‌ప్రైజ్ విజిట్ మంచిదే..
‘ఈసారి గణేశ్ విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉంది.. 40 ఫీట్ల కన్నా ఎత్తు ఉన్న విగ్రహాలు ఈసారి పెరిగాయి. దీంతో శోభాయాత్ర ఆలస్యమైంది. నిన్న(శనివారం) రాత్రి శోభాయాత్రలో చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఐదు కేసులు నమోదు చేశాం. వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేసినందుకు మా పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. ప్రణాళిక ప్రకారమే గణనాథుల నిమజ్జన శోభాయాత్ర జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి వినాయక శోభాయాత్రలో సర్‌ప్రైజ్ విజిట్ చేయడం మంచిదే. వీఐపీ విజిట్స్‌తో ఎలాంటి సమస్య లేదు. మమ్మల్ని అభినందించడం ప్రోత్సాహకంగా ఉంది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ఆర్టీఏ, హెచ్ఎండీఏ అధికారుల సమన్వయంతో సక్సెస్ ఫుల్‌గా నిమజ్జనం పూర్తయింది. ఖైరతాబాద్ గణేశ్ దగ్గర నిన్నటి వరకు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 1,070 మంది ఆకతాయిలను పట్టుకున్నాం. పిక్ పాకెటింగ్ కేసులు కూడా నమోదు చేశాం. గతేడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేట్ తగ్గింది. ఈసారి వినాయక నిమజ్జనంలో టెక్నాలజీని ప్రత్యేకంగా వాడాం. 9 డ్రోన్లు వినియోగించాం. వీటి ద్వారా మాకు మంచి వ్యూ తెలిసింది. 35 హై రైజ్ బిల్డింగ్స్‌పైన సీసీ కెమెరాలు పెట్టి మానిటరింగ్ చేశాం’ అని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు
ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్: మంత్రి తుమ్మల
For More TG News And Telugu News