Harish Rao: బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి: హరీశ్‌రావు
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:59 PM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే సరిపోతోందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోతుందా.. నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (Telangana CM Revanth Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ ద్రోహి, జలదోపిడి ద్రోహి రేవంత్‌రెడ్డినే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు హరీశ్‌రావు. ఏపీ నిర్మిస్తోన్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్‌కు సీడబ్య్లూసీ అనుమతి వచ్చిందని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం లేకుండా సీడబ్య్లూసీ ఎలా అనుమతి ఇస్తోందని ప్రశ్నల వర్షం కురిపించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని ఆక్షేపించారు హరీశ్‌రావు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే సరిపోతోందని విమర్శించారు. నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోతుందా.. నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తాను ఎటువంటి ఫేక్ రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణతో ఉన్న అనుబంధంతోనే తాను ఇలా మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు హరీశ్‌రావు.
తెలంగాణ జలదోపిడికి సూత్రదారి ఆదిత్య నాథ్ దాస్ అని ఆరోపణలు చేశారు. తెలంగాణ ద్రోహి ఆయనేనని ఆక్షేపించారు. ఆదిత్య నాథ్ దాస్‌ను రేవంత్‌రెడ్డి సర్కార్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు సీడబ్య్లూసీ అనుమతి ఇచ్చేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఎంత ధైర్యమని నిలదీశారు. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై సీడబ్య్లూసీ అనుమతి రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నా చేద్దామని హరీశ్‌రావు సూచించారు.
ఇవి కూడా చదవండి...
నగరంలో జింక మాంసం కలకలం.. నిందితుల గుట్టురట్టు చేసిన పోలీసులు
అలర్ట్.. న్యూఇయర్ వేళ పోలీసుల కీలక సూచన
Read Latest Telangana News And Telugu News