Deer Meat Case: నగరంలో జింక మాంసం కలకలం.. నిందితుల గుట్టురట్టు చేసిన పోలీసులు
ABN , Publish Date - Dec 30 , 2025 | 03:21 PM
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పరిధిలో జింక మాంసం విక్రయాలు కలకలం రేపాయి. అత్తాపూర్‌లోని సులేమాన్ నగర్ ప్రాంతంలో జింక మాంసాన్ని అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్‌ను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ (Attapur) పరిధిలో జింక మాంసం (Deer Meat Case) విక్రయాలు కలకలం రేపాయి. అత్తాపూర్‌లోని సులేమాన్ నగర్ ప్రాంతంలో జింక మాంసాన్ని అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్‌ను ఎస్‌వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పక్కాగా సమాచారం రావడంతో రంగంలోకి దిగి తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో నిందితుడి దగ్గరి నుంచి భారీగా జింక మాంసం, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ ఇర్ఫానుద్దీన్ దగ్గరి నుంచి సుమారు 15 కిలోల జింక మాంసం, జింక తోలు, జింక తలతో పాటు రూ.3,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వన్యప్రాణుల వేట, విక్రయాలు నేరమని పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు పెబ్బేరు ప్రాంతం నుంచి జింక మాంసాన్ని నగరానికి తీసుకువచ్చి, అత్తాపూర్ పరిధిలో స్థానికంగా వధించి విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కిలో జింక మాంసాన్ని రూ.800 చొప్పున అమ్ముతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఎస్‌వోటీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న మాంసం, ఇతర ఆధారాలతో పాటు అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం జింక, తదితర అటవీ జంతువులను వేటాడటం, వాటి మాంసం లేదా అవయవాలను విక్రయించడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తామని అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో అత్తాపూర్, సులేమాన్ నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. వన్యప్రాణి మాంసం విక్రయాలు లేదా అక్రమ వేటకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు. నగరంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్‌వోటీ పోలీసులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన మహిళ.. ఎంత డబ్బు పోగొట్టుకున్నారంటే..
శాంతి భద్రతలు అదుపులోనే.. వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ
Read Latest Telangana News And Telugu News