Share News

New Year Travel: అలర్ట్.. న్యూఇయర్ వేళ పోలీసుల కీలక సూచన

ABN , Publish Date - Dec 30 , 2025 | 05:19 PM

నూతన సంవత్సర వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల అనంతరం ప్రజలు ఇంటికి చేరుకునే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశారు.

New Year Travel: అలర్ట్.. న్యూఇయర్ వేళ పోలీసుల కీలక సూచన
New Year Travel

హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సర వేడుకలకు (New Year celebrations) భాగ్యనగరం సిద్ధమవుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల అనంతరం ప్రజలు ఇంటికి చేరుకునే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశారు. ముఖ్యంగా క్యాబ్, ఆటో, బైక్ సేవల విషయంలో ప్రయాణికులు ఏమైన సమస్యలు ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గజరావ్ భూపాల్ (Cyberabad Joint CP Gajrao Bhupal) విజ్ఞప్తి చేశారు.


నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబరు 31వ తేదీ రాత్రి నగరంలో రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాబ్‌లు రాకపోవడం, ఆటో లేదా బైక్ డ్రైవర్లు చెప్పిన ప్రాంతానికి రావడానికి నిరాకరించడం, లేదా సాధారణం కంటే అధికంగా డబ్బు డిమాండ్ చేయడం వంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని జాయింట్ సీపీ వ్యాఖ్యానించారు.


అటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. ఆటో, క్యాబ్, బైక్ డ్రైవర్లు అధిక చార్జీలు అడిగినా, లేదా బుక్ చేసిన క్యాబ్ రావడంలో నిర్లక్ష్యం చూపినా వెంటనే ఈ 94906 17346 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందజేయాలని సూచించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని గజరావ్ భూపాల్ తెలిపారు. నూతన సంవత్సర వేడుకల అనంతరం రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించే వారు, మహిళలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్య ఎదురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని కోరారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరమంతా ట్రాఫిక్ పోలీసులు, పేట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. రోడ్లపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సురక్షిత ప్రయాణానికి అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.


నూతన సంవత్సరం ఆనందంగా జరుపుకోవాలని, కానీ భద్రత విషయంలో రాజీపడవద్దని సూచించారు. వేడుకల అనంతరం మద్యం సేవించి వాహనం నడపకుండా క్యాబ్ లేదా ఇతర రవాణా సేవలను వినియోగించాలని కోరారు. అదే సమయంలో, రవాణా సేవల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


పోలీసుల నిర్ణయంతో ప్రయాణికులకు భరోసా కలిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమస్య ఎదురైనప్పుడు నేరుగా పోలీసులను సంప్రదించవచ్చనే అవగాహన ప్రజల్లో పెరిగితే అక్రమ వసూళ్లకు పాల్పడే క్యాబ్ నిర్వాహకులకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరేందుకు సైబరాబాద్ పోలీసులు తీసుకున్న ఈ చర్యలు అభినందనీయమని భాగ్యనగరవాసులు అంటున్నారు.


ఇవి కూడా చదవండి...

నగరంలో జింక మాంసం కలకలం.. నిందితుల గుట్టురట్టు చేసిన పోలీసులు

శాంతి భద్రతలు అదుపులోనే.. వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 30 , 2025 | 05:41 PM