Bandi Sanjay Kumar VS BRS: కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ కారణం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:08 PM
కాళేశ్వరంపై బీజేపీ వైఖరే నిజమని మరోసారి రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ కోరారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1, (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకు రేవంత్‌రెడ్డి సర్కార్ అప్పగించడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)పై బీజేపీ (BJP) వైఖరే నిజమని మరోసారి రుజువైందని ఉద్ఘాటించారు. కాళేశ్వరం అవినీతికి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని కోరారు. కాళేశ్వరం అవినీతికి ముమ్మాటికీ బీఆర్ఎస్ కారణమని ఆరోపించారు. ఇవాళ(సోమవారం) సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణను బీజేపీ తొలిసారిగా కోరిందని గుర్తుచేశారు బండి సంజయ్ కుమార్.
కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్‌ను కాపాడుతూ ఆలస్యం చేసిందని ఆరోపించారు. నిజానికి తలవంచి సీబీఐకి కేసు అప్పగింతకు రేవంత్‌రెడ్డి సర్కార్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే సీబీఐకి లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ORR టోల్ టెండర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను ప్రకటించిందని తెలిపారు. అది నేటికీ ఆచరణ రూపంలోకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్‌లా కొనసాగుతోందని బండి సంజయ్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి సహకరించాలి: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

కాళేశ్వరం ప్రాజెక్టుపై 22 నెలలు రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం చేసిందని.. తీరా ఇప్పుడు సీబీఐకి ఇచ్చారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కాళేశ్వరం కేసు సీబీఐకి ఇవ్వాలని మొదటి నుంచి బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఇవాళ(సోమవారం) హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ఆధారాలతో సీబీఐకి సహకరించాలని సూచించారు. తెలంగాణ ప్రజల ధనాన్ని బీఆర్ఎస్ నేతలు మెక్కినదంతా కక్కించాలని హెచ్చరించారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం అవినీతిలో లేరనే విషయాన్ని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగబద్ధ సంస్థలపై గౌరవం లేకుండా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడతారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్‌పై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.
కేసీఆర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కుతోనే సీబీఐ విచారణను ఆలస్యం చేశారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లోనే రేవంత్‌రెడ్డి.. కాళేశ్వరం కేసును సీబీఐకు అప్పగించారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించడానికి 22నెలలు ఎందుకు ఆలస్యం చేశారో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు. సీబీఐ విచారణపై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించటం లేదు..? అని ప్రశ్నించారు. గుమ్మడికాయల దొంగ అంటే.. మాజీ మంత్రి కేటీఆర్ భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు అహం తగ్గలేదని.. ప్రజలు ఓడించినా బుద్ధి రావటం లేదని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై అన్ని ఆధారాలు ఉన్నాయని టీపీసీసీ హోదాలో రేవంత్‌రెడ్డి అన్నారని గుర్తుచేశారు. అన్ని ఆధారాలను సీబీఐకు రేవంత్‌రెడ్డి ఇవ్వాలని సూచించారు. తెలంగాణ సంపదను దోచుకున్న వారిని ఖచ్చితంగా శిక్షించాలని హెచ్చరించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై మాట్లాడే అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు.
సీబీఐపై నమ్మకముంది: ఎంపీ ఈటల రాజేందర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను రేవంత్‌రెడ్డి సర్కార్ సీబీఐకు అప్పగించడంపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి మంచి పని చేశారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేతకాదని.. అందుకే సీబీఐకి అప్పగించారని విమర్శించారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు తప్పుల తడక అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని చెప్పుకొచ్చారు. సీబీఐ సంపూర్ణంగా విచారణ చేస్తోందనే తమకు నమ్మకముందని ఉద్ఘాటించారు. కాళేశ్వరంపై జరిగిన అక్రమాలను సీబీఐ బయటపెడుతుందని సంపూర్ణ విశ్వాసం తమకు ఉందని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు
తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం
Read latest Telangana News And Telugu News