BC Bill Approved Legislative Council: తెలంగాణ శాసనమండలిలో బీసీ బిల్లుకు ఆమోదం
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:07 AM
తెలంగాణ శాసనమండలి సోమవారం ప్రారంభమైంది. అయితే సభ ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ సభ్యుల గందరగోళం నడుమ నాలుగు బిల్లులను మండలి ఆమోదించింది. మొదటగా బీసీ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపింది.
హైదరాబాద్, సెప్టెంబర్1, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ శాసనమండలి (Telangana Legislative Council) ఇవాళ(సోమవారం) ప్రారంభమైంది. అయితే సభ ప్రారంభించిన తర్వాత బీఆర్ఎస్ సభ్యుల గందరగోళం నడుమ నాలుగు బిల్లులను మండలి ఆమోదించింది. మొదటగా బీసీ బిల్లుపై (BC Bill) చర్చించి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టసవరణ, పురపాలక సంఘాల చట్టసవరణ, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యనే మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి.
బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన...
మరోవైపు.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నివేదికపై నిన్న(ఆదివారం) తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చల అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులు గందరగోళం సృష్టించారు. చైర్మన్ పోడియం దగ్గర బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు.
దీంతో శాసనమండలిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక పేపర్లు చింపి మండలి చైర్మన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకి సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబీఐ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియం వద్ద నిరసన వ్యక్తం చేయొద్దని.. వారికి కేటాయించిన స్థానాల్లోనే నిరసన వ్యక్తం చేయాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనలతో శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.
బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క ఫైర్
శాసనమండలిలో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ నినాదాలు చేసే అర్హత బీఆర్ఎస్‌కు లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చినప్పుడే తెలంగాణతో టీఆర్ఎస్ బంధం తెగిపోయిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన టీఆర్ఎస్‌కు తెలంగాణ మాట పలికే అర్హత కోల్పోయిందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. టీజీఎస్పీడీసీఎల్ కొత్త నిబంధనలు
గవర్నర్‌ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఎందుకంటే
Read latest Telangana News And Telugu News