Bandi Sanjay Kumar ON Journalist Assurance: తెలంగాణలో జర్నలిస్టుల పక్షాన బీజేపీ నిలబడుతుంది
ABN , Publish Date - Aug 21 , 2025 | 09:31 PM
జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్, ఆగస్టు21(ఆంధ్రజ్యోతి): జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీతో సహా హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2024లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు (Supreme Court) డిస్మిస్ చేయడంతో తీవ్ర నిరాశ, నిస్ప్రహల్లో మునిగిపోయిన జర్నలిస్టులకు (Journalist) కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) బాసటగా నిలిచారు. జర్నలిస్టులు ఎవరూ బాధపడవద్దని సూచించారు. జర్నలిస్టులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీనేనని బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా న్యాయ నిపుణులతో ముందుగానే చర్చించి జర్నలిస్టులందరికీ ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు దక్కకపోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అవకాశవాద రాజకీయాలే కారణమని విమర్శించారు. ఓట్లపై ఉన్న శ్రద్ధ జర్నలిస్టులతో సహా పేదవర్గాలను ఆదుకోవడం లేదని దుయ్యబట్టారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న బండి సంజయ్ కుమార్ జర్నలిస్టుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం దురదృష్టకరం..
‘జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీతో సహా హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ 2024లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడం దురదృష్టకరం. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యమే. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూమంత్రంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో జారీ చేశారు. న్యాయస్థానంలో ఆయా ప్రభుత్వాలు సరైన వాదనలను వినిపించడంలో పూర్తిగా వైఫల్యం చెందడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా భావిస్తున్న జర్నలిస్టుల జీవితాలు దుర్భరంగా మారాయి. చాలీచాలని జీతాలతో పనిచేస్తూ అద్దె ఇండ్లలో నివసిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. సుప్రీంకోర్టు తీర్పుతో జర్నలిస్టు సమాజమంతా తీవ్ర నిరాశలో ఉంది. వారిని ఆదుకుని అండగా నిలవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోకపోతే వారికి న్యాయం చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయ నిపుణులతో చర్చించి న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లను నిర్మించి ఇస్తాం’ అని బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
శ్రీశైలంలో కుట్రలు.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
కాళేశ్వరం నివేదిక.. హై కోర్టులో వాడివేడిగా వాదనలు
Read Latest Telangana News And Telugu News