Rammohan Naidu: త్వరలోనే కొత్త సిక్కోలును చూడబోతున్నాం: రామ్మోహన్
ABN , Publish Date - Dec 27 , 2025 | 08:47 PM
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకూ తొమ్మిది జిల్లాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు.
శ్రీకాకుళం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Union Minister Kinjarapu Rammohan Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తల తోక లేని పనులతో పాలనను జగన్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో చేసిన తప్పులను తమ ప్రభుత్వంలో సరి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ కూటమి సర్కార్ ప్రజారంజక పాలన అందిస్తోందని వ్యాఖ్యానించారు. ఇవాళ(శనివారం) శ్రీకాకుళంలో దిశా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు రామ్మోహన్ నాయుడు.
ఈ దిశ సమీక్ష ద్వారా జిల్లాలో వ్యవసాయ వృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టిపై ప్రత్యేకంగా సమీక్షించామని తెలిపారు. సరైన ప్రణాళిక లేక ఇంటింటికీ కుళాయిలు లేకుండా జగన్ ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. వచ్చే డిసెంబరులోగా ప్రతీ ఇంటికి తాగునీటీ కుళాయిలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కేంద్ర నిధుల వినియోగంతో జిల్లాను అభివృద్ధి పదంలో పయనింపజేస్తామని తెలిపారు. ఏపీని ఆర్థిక కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ పాలనను గాడిలో పెట్టారని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి వరకూ తొమ్మిది జిల్లాలను సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు రామ్మోహన్ నాయుడు.
క్లస్టర్ విధానం ద్వారా నీతి ఆయోగ్ నిధులను వినియోగించుకుని అన్ని ప్రాంతాలను వృద్ధిలోకి తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. రవాణా అవకాశాలను వృద్ధి చేయడం ద్వారా శ్రీకాకుళం జిల్లా అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలను చేరుకుంటుందని వివరించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్ట్‌ల ద్వారా ఉపాధి విప్లవం సృష్టిస్తున్నామని అన్నారు. దానికి తోడు నూతన జాతీయ రహదారి, కార్గో ఎయిర్‌పోర్ట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త సిక్కోలును చూడబోతున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం
జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం
Read Latest AP News And Telugu News