Share News

District Reorganization: జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం

ABN , Publish Date - Dec 27 , 2025 | 03:21 PM

జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెల 27వ తేదీన జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

District Reorganization: జిల్లాల పునర్విభజనలో కీలక మార్పులకు సిద్ధమైన ఏపీ ప్రభుత్వం
District Reorganization

అమరావతి,డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇవాళ(శనివారం) ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేశారు. జిల్లాల పునర్విభజనలో కొద్దిపాటి మార్పు చేర్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు సమావేశంలో 927 అభ్యంతరాలు, సూచనలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకే గూడూరును కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్, మార్కాపురం జిల్లాకు దొనకొండ, కురిచేడు మండలాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 31న తుది నోటిఫికేషన్‌ను ఏపీ సర్కార్ జారీ చేయనుంది.


అయితే, జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్‌ను నవంబరు 27వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నెల రోజుల పాటు అభ్యంతారాలను స్వీకరించింది. అయితే ఈరోజు(శనివారం)తో గడువు ముగుస్తోంది. ప్రాథమిక నోటిఫికేషన్‌ అనంతరం వ్యక్తమైన అభ్యంతరాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేటను కడపలో కలిపి, రాయచోటిని మదనపల్లిలో కలిపే ప్రతిపాదనలపై ప్రభుత్వం కీలక సమాలోచనలు చేసింది. ఇప్పటికే ప్రకటించిన మూడు జిల్లాలతో 29 వరకు జిల్లాల సంఖ్య పెరగాల్సి ఉంది. తాజా ప్రతిపాదనలతో 28 జిల్లాలకే పరిమితం చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.


ఇప్పటికే ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన రాయచోటిని మదనపల్లిలో కలిపే దిశగా సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే ప్రకటించిన 3జిల్లాలపై అభ్యంతరాలు, ప్రతిపాదనలపై సమీక్షించారు సీఎం. దొనకొండ, కురిచేడును మార్కాపురం జిల్లాలో.. పొదిలిని ఒంగోలు జిల్లాలో కలిపితే ఎలా ఉంటుందని చర్చించారు. స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రైల్వే కోడూరును తిరుపతిలో కలిపే అంశంపై కసరత్తు చేశారు. రేపు(ఆదివారం) మరోసారి సమావేశమై ఎల్లుండి మంత్రివర్గం ముందుకు ప్రతిపాదనలు తీసుకురానుంది మంత్రివర్గ ఉపసంఘం. కేబినెట్ ఆమోదం తర్వాత ఈనెల 31వ తేదీన తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనిత, నారాయణ హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులపై పోలీసుల ఉక్కుపాదం

ఆయన చేపలు తిన్నారు.. ఈయన కోడి కూర తిన్నారు.. జగన్‌, కేసీఆర్‌లపై జగ్గారెడ్డి సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 27 , 2025 | 04:10 PM