Jagga Reddy: ఆయన చేపలు తిన్నారు.. ఈయన కోడి కూర తిన్నారు.. జగన్, కేసీఆర్‌లపై జగ్గారెడ్డి సెటైర్లు
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:51 PM
ప్రభుత్వపరంగా సీఎంలు, ఆశాఖ మంత్రులు చర్చించాల్సిన అంశాలపై తానేమీ మాట్లాడనని జగ్గారెడ్డి తెలిపారు. గతంలో జగన్, కేసీఆర్‌లు వీటిపై ఎప్పుడైనా చర్చలు చేశారా అని ప్రశ్నించారు.
విజయవాడ, డిసెంబర్ 27: మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (PCC Working President Jagga Reddy) సెటైర్లు విసిరారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై ఉన్నత స్థాయిలో చర్చ జరగాలన్నారు. నీటి ప్రాజెక్టులు, కేటాయింపులపై ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటారని తెలిపారు. గతంలో కేసీఆర్.. జగన్ ఇంటికి వచ్చి చేపలు తిన్నారని.. జగన్ హైదరాబాద్‌లో కేసీఆర్ ఇంటికి వచ్చి కోడి కూర తిన్నారంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అంత దిగజారి వ్యవహరించరని స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా సీఎంలు, ఆశాఖ మంత్రులు చర్చించాల్సిన అంశాలపై తానేమీ మాట్లాడనని తెలిపారు. గతంలో జగన్, కేసీఆర్‌లు వీటిపై ఎప్పుడైనా చర్చలు చేశారా అని ప్రశ్నించారు. మీడియా వాళ్లు వారిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, ఇరు రాష్ట్రాల ప్రజలు బాగుండాలనేదే తన ఆకాంక్ష అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
అది ఒక చరిత్ర...
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఒక చరిత్రన్నారు. ఆనాడు ప్రజల భాగస్వామ్యంతో విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేశారని తెలిపారు. గుంటూరు నుంచి విశాఖ వెళ్లి ఆ ఫ్యాక్టరీ కోసం పోరాటాలు చేశారని గుర్తుచేశారు. 1970లో ఇందిర గాంధీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పార్లమెంటులో ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం విశాఖ స్టీల్ ఫ్లాంట్‌ను కాంగ్రెస్ జాతికి అంకితం చేసిందని చెప్పుకొచ్చారు. రూ.14 వేల కోట్లతో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ వల్ల విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. వేలు, లక్షల కుటుంబాలు స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి జీవనం సాగించారన్నారు. ఆనాటి ఉద్యమం ద్వారా అనేక మంది నాయకులుగా ఎదిగారని తెలిపారు. వెంకయ్య నాయుడు కూడా ఉద్యమం ద్వారా జాతీయ స్థాయి నేతగా ఎదిగారని ఆయన అన్నారు.
జగన్ ఎందుకు మాట్లాడరు...
యూపీఏ ప్రభుత్వంలో నష్టాలను భర్తీ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతూ వచ్చారన్నారు. రూ.14 వేల కోట్లతో ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ విలువ నేడు రెండున్నర లక్షల కోట్ల సంపదకు చేరిందని వెల్లడించారు. దీనిపై మోదీ కన్నుపడటంతో ఎవరికో కట్టపెట్టాలనే దురుద్దేశంతో కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్రం విడిపోయిందన్నారు. విభజన వల్ల ఏపీలో కాంగ్రెస్‌ను ప్రజలు పూర్తిగా ఓడించారన్నారు. విభజన అనంతరం చంద్రబాబు, జగన్‌లు సీఎంగా చేశారని.. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యారన్నారు. పోలీసులు ఏ ప్రభుత్వం ఉంటే వారికే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని విమర్శించారు. రెండు లక్షల కోట్లు విలువ చేసే విశాఖ స్టీల్ ఫ్లాంట్ కూడా కట్టపెట్టేలా కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో మాజీ సీఎం జగన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. సోనియా గాంధీ రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా విభజన చేసి మాట నిలపెట్టుకున్నారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్... ఆంధ్రుల హక్కు అని దానిని కాపాడుకోవాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తృటిలో ప్రమాదం తప్పిందిగా.. వెనక్కి జారిన ట్రైన్
ఎంతకు దిగజారారు.. పవన్ ఫొటోపై అసభ్యకర పోస్ట్...
Read Latest AP News And Telugu News