Visakhapatnam: తృటిలో ప్రమాదం తప్పిందిగా.. వెనక్కి జారిన ట్రైన్
ABN , Publish Date - Dec 27 , 2025 | 09:46 AM
కైలాసగిరిపై ఉన్న టాయ్ రైలుకు ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న రైలుకు బ్రేకులు ఫెయిల్ అయ్యింది. దీంతో రైలు వెనక్కి జారింది.
విశాఖపట్నం, డిసెంబర్ 27: విశాఖ కైలాసగిరిలో రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో రైలు వెనక్కి జారింది. ఘటన జరిగిన సమయంలో రైలులో వంద మందికిపైగానే పర్యాటకులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు. విశాఖపట్నంలో పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిలో ఉన్న టాయ్ రైలు.. అక్కడకు వచ్చిన పర్యాటకులను కొండపైన తిప్పుతుంది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం తరువాత పర్యాటకులను తీసుకెళ్తుండగా స్టేషన్ సమీపంలోకి వచ్చాక బ్రేకులు పడకపోవడంతో తిరిగి వెనక్కి వెళ్లింది.
అయితే ఎక్కడా డౌన్ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. వెనక్కి కొంత దూరం పాటు వెళ్లిన తర్వాత యదావిధిగా రైలు ఆగిపోయింది. కానీ ఆ సమయంలో సుమారు వంద మంది ప్రయాణికులు రైలులో ఉన్నారు. ఓవర్ లోడ్ అవడం వల్లనా లేక టెక్నికల్ సమస్యనా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. కైలాసగిరికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే అటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
దీంతో నిర్వాహకులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగితే ఎంతో మంది ప్రయాణికులు గాయపడే అవకాశం ఉన్నందున దీనిపై అధికారులు దృష్టిపెట్టాలని ప్రతీఒక్కరూ కోరుతున్న పరిస్థితి. ఇక గత వారం రోజులుగా విశాఖకు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. కైలాసగిరికి పెద్ద ఎత్తున పర్యాటకులు రావడంతో రైలులో ఓవర్‌లోడ్ వల్లే ఇలా జరిగి ఉంటుందనే అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
రైల్వే చార్జీల పెంపు స్వల్పమే!
Read Latest AP News And Telugu News