Nizamabad Robbery: నిజామాబాద్‌లో దొంగల బీభత్సం
ABN , Publish Date - Dec 27 , 2025 | 09:16 AM
నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఏటీఎంలలో చోరీ చేసిన దుండగులు.. దాదాపు రూ. 50 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్, డిసెంబర్ 27: జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని రెండు ఏటీఎంలలో చోరీకి తెగబడ్డారు. నగదు ఎత్తుకెళ్లడంతో పాటు ఏటీఎంలకు నిప్పు పెట్టి పరారయ్యారు దుండగులు. వర్ని రోడ్డు సాయినగర్‌లోని ఎస్‌బీఐ, పాంగ్రా వద్ద కో ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలను ధ్వంసం చేసి మరీ దుండగులు నగదును చోరీ చేశారు. రెండు ఏటీఎంలలో కలిపి సుమారు రూ.50 లక్షల వరకు చోరీ అయినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అయితే దుండగులు తెలుపు రంగు క్రేటా కారులో వచ్చినట్లు గుర్తించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేవలం ఒక గంటలోనే రెండు ఏటీఎంలలో చోరీ జరగడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన ఓ ముఠా దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. వీరంతా కూడా రెండు మూడు రోజుల క్రితం ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒక వైట్ కలర్ కారు, బైక్‌పై వచ్చిన రెండు వేర్వేరు బృందాలు రెండు చోట్ల చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు.
ముందుగా ఎస్‌బీఐ ఏటీఎంలోకి ప్రవేశించిన వెంటనే లోపల ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తర్వాత ఏటీఎం మిషన్‌పై ఒకరకమైన స్ప్రే కొట్టినట్లు తెలుస్తోంది. ఆ స్ప్రే చల్లిన తర్వాత ఏటీఎంకు నిప్పు పెట్టారు. మిషన్ పూర్తిగా కాలిపోయిన తర్వాత లోపల ఉన్న నగదును, క్యాష్ బాక్స్‌ను దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తరువాత పాంగ్రా వద్ద గల కోఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంపై కూడా ఇలాగే దాడి చేసి నగదును దోచుకున్నట్లు సమాచారం. అయితే గతంలో ఏటీఎం ధ్వంసం చేయడం, లేదా ఏటీఎం మిషన్‌లే ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఏటీఎంకు నిప్పు పెట్టి మరీ నగదును దోచుకెళ్లడం సంచలనంగా మారింది. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు దుండగులు ఇలా నిప్పు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ చోరీలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి...
ప్రాణం మీదకు తెచ్చిన చైనా మాంజా..
రైల్వే చార్జీల పెంపు స్వల్పమే!
Read Latest Telangana News And Telugu News