Share News

Severe Cold Wave: బయట సురుకు.. ఇంట్లో వణుకు

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:54 AM

ఇంట్లో ఉంటే గజగజ.. బయటికి వెళ్తే మాత్రం కాస్త వెచ్చగా..! రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన వాతావరణ పరిస్థితి ఇది. సాధారణంగా ఇంట్లో వెచ్చగా ఉండి, బయటికి వెళితే చలివేయాలి....

Severe Cold Wave: బయట సురుకు.. ఇంట్లో వణుకు

  • గోడలు రాత్రంతా చల్లబడి ‘కోల్డ్‌ బ్యాటరీ’ ఎఫెక్ట్‌

  • ఫలితంగా రోజంతా ఇంట్లో భరించలేని చలి

  • మేఘాలు లేక నేరుగా దూసుకొస్తున్న కిరణాలు

  • గాలిలో తేమ తగ్గడంతో బయట కాస్త వేడి

  • రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితి

  • గత పదేళ్లలో ఈసారే ఎక్కువగా చలి తీవ్రత

  • చాలాచోట్ల 9-10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

  • పెరిగిన రూమ్‌ హీటర్లు, గీజర్ల విక్రయాలు

  • సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఉంటే గజగజ.. బయటికి వెళ్తే మాత్రం కాస్త వెచ్చగా..! రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన వాతావరణ పరిస్థితి ఇది. సాధారణంగా ఇంట్లో వెచ్చగా ఉండి, బయటికి వెళితే చలివేయాలి.. కానీ ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. ఉదయం పది గంటల వరకు ఇంట్లో వెచ్చగా, బయట చలిగా ఉంటే... ఆ తర్వాత ఇంట్లో చలి వేస్తోంది, బయటికెళితే మాత్రం కాస్త ఉపశమనం అనిపిస్తోంది. ఎవరిని కదిలించినా ఇదే మాట చెబుతున్నారు. శీతల గాలులు, మన ఇళ్ల గోడలే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర వాయవ్య దిశ నుంచి వీస్తున్న శీతల గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. దీనితో ఇళ్ల కాంక్రీటు గోడలు, శ్లాబులు రాత్రంతా చల్లబడి ‘కోల్డ్‌ బ్యాటరీ ఎఫెక్ట్‌’ ఏర్పడుతోంది. ఉదయం ఎండతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా... ఇళ్ల గోడలు, శ్లాబ్‌ నుంచి రోజంతా చల్లదనం వెలువడుతోంది. దీనితో ఇంట్లో చలివేస్తోంది. ఇక రెండో అంతస్తు, ఆపైన ఉండే వారికి శీతలగాలుల ప్రభావంతో మరింత ఎక్కువగా చలి ఉంటోంది. మరోవైపు ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో, గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుండటంతో సూర్యకిరణాలు నేరుగా దూసుకొస్తున్నాయి. ఎండ చురుక్కుమంటోంది. ఈ తీవ్రతకు నేల, పరిసరాలు వేడిక్కి బయట వెచ్చదనం నెలకొంటోంది. సూర్యాస్తమయం వరకు ఈ ప్రభావం ఉంటోంది. తర్వాత మళ్లీ బయట చలిపెరుగుతోంది. ఇళ్లలో వెచ్చగా ఉంటోంది.


గత పదేళ్లలో తీవ్రమైన చలి ఇప్పుడే..

గత పదేళ్లలో ఎక్కువ రోజులు తీవ్రమైన చలి కమ్ముకున్నది ఈసారి శీతాకాలంలోనే అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దాదాపు నెల రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా నమోదవుతున్నాయి. ఉమ్మడి మెదక్‌, ఆదిలాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఆరేడు డిగ్రీలకు పడిపోతున్నాయి. హైదరాబాద్‌లోనూ ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. హెచ్‌సీయూ, పటాన్‌చెరు, గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌ వంటి శివారు ప్రాంతాల్లో 6-8 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ దెబ్బకు చాలా మంది రూమ్‌ హీటర్లు, నీటిని వేడి చేసే గీజర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఏడాది వాటి అమ్మకాల్లో 15శాతం వృద్ధి నమోదైందని వ్యాపారులు చెబుతున్నారు. రూమ్‌ హీటర్లకు డిమాండ్‌ బాగా ఉంటోందని, ఈ-కామర్స్‌ సైట్లలో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

సంక్రాంతి నుంచి ఉపశమనం

తెలంగాణలో జనవరి రెండో వారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలు, ఆపైన నమోదవుతాయని వాతావరణ వివరాలు, ముందస్తు అంచనాలు అందించే ‘స్కైమెట్‌ ’ వెబ్‌సైట్‌ అంచనా వేసింది. మరో వాతావరణ వెబ్‌సైట్‌ ఆక్యువెదర్‌.. జనవరి తొలివారం తర్వాత చలి నుంచి ఉపశమనం ఉంటుందని, నెలాఖరుకల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-19 మధ్యకు చేరుతాయని పేర్కొంది. ఈనెల 31వరకు తీవ్రమైన చలి పరిస్థితులు (కోల్డ్‌వేవ్‌) కొనసాగుతాయని.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణులంతా చెబుతున్నారు.


‘కోల్డ్‌ బ్యాటరీ’.. 12 డిగ్రీల కంటే తగ్గితే అంతే!

ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినప్పుడు కాంక్రీటు గోడలు, శ్లాబులు ఆ ప్రభావానికిలోనై తీవ్రంగా చల్లబడతాయి. ఎంత ఎక్కువ సేపు అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే.. అంత ఎక్కువగా వాటిలో చల్లదనం నిల్వ అవుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగిన తర్వాత ఆ చల్లదనం వెలువడుతూ ఉంటుంది. దీనినే ‘కోల్డ్‌ బ్యాటరీ ఎఫెక్ట్‌’ అనవచ్చు. సాధారణంగా 12 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కాంక్రీటు గోడలు, శ్లాబులు ఆ చల్లదనానికి పెద్దగా ప్రభావితం కావు. అంతకన్నా ఎంత తగ్గుతూ పోతే.. అంతగా చల్లబడి, ‘కోల్డ్‌ బ్యాటరీ’ ప్రభావం అంతగా పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు 8, 9 డిగ్రీలకు తగ్గిపోతే... గోడలు, శ్లాబు నుంచి తర్వాతి రోజంతా చల్లదనం వెలువడుతూనే ఉంటుంది. దానితో బయటికంటే ఇంట్లో చలి ఎక్కువగా ఉంటుంది.

పదేళ్లలో అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇప్పుడే..

ఈ ఏడాది వానలు ఎక్కువగా కురవడం, ఉత్తర వాయవ్య దిశ నుంచి వీస్తున్న శీతల గాలులతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. గత పదేళ్లలో అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు, ఎక్కువ రోజులు కొనసాగడం ఈసారే చూస్తున్నాం. మరో 10 రోజుల వరకు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం 15 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటోంది. ఇలా ఎక్కువ వ్యత్యాసం ఉంటే మన శరీరం తట్టుకోలేదు. ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి.

- నరేందర్‌, మెట్రాలజిస్టు, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

Updated Date - Dec 27 , 2025 | 05:42 AM