Ayesha Meera Case: సంచలనం సృష్టించిన కేసుకు 18 ఏళ్లు పూర్తి..
ABN , Publish Date - Dec 27 , 2025 | 09:17 AM
సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత విజయవాడ కోర్టులో కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ మాయమైపోయాయి. సీబీఐ ఉన్న ఆధారాలతోనే దర్యాప్తు సాగించింది. రెండు నెలల క్రితం దర్యాప్తు పూర్తయిందని హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది.
(ఆంధ్రజ్యోతి విజయవాడ): ఆయేషామీరా.. రాష్ట్రంలో సంచలనమైన ఘటనల్లో ఇదొకటి. ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కాలేజీలో బీ-ఫార్మసీ చదివే ఆయేషామీరాను అత్యాచారం చేసి చంపేసిన విషయం తెలిసిందే. 2007 డిసెంబరు 27న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగి శనివారానికి 18 ఏళ్లు పూర్తవుతోంది. న్యాయం కోసం ఇప్పటికీ ఆమె తల్లిదండ్రులు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ కేసు అనేక మలుపులు తిరిగింది.
ప్రస్తుతం ఈ కేసు విచారణ సీబీఐ కోర్టులో సాగుతోంది. ఆయేషా హత్య జరిగిన తర్వాత అప్పటి పోలీసులు నందిగామ మండలం అనాతవరం గ్రామానికి చెందిన పిడతల సత్యంబాబును నిందితుడిగా పేర్కొంటూ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో సత్యంబాబుకు కింది కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిపై అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
అభ్యంతరాలతో మరో మలుపు
సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత విజయవాడ కోర్టులో కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ మాయమైపోయాయి. సీబీఐ ఉన్న ఆధారాలతోనే దర్యాప్తు సాగించింది. రెండు నెలల క్రితం దర్యాప్తు పూర్తయిందని హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఆ నివేదికను విజయవాడలోని సీబీఐ కోర్టులో అందజేయాలని ఆదేశించింది. దీనితో సీబీఐ నివేదికను కోర్టులో అందజేసింది. తర్వాత సత్యంబాబును నిందితుడిగా పేర్కొనడంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఆయేషా మీరా తల్లిదండ్రులకు కోర్టు నోటీసులు అందజేసింది. దీనిపై వారు సీబీఐ నివేదికను తమకు అందజేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ద్వారా కొన్ని కాగితాలు మాత్రమే తమ చేతికి అందాయని వారి తరపున న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ తెలిపారు. ఆయేషా ఘటన జరిగి 18 ఏళ్లు పూర్తయినా న్యాయం జరగలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు ఇంకా న్యాయస్థానాల్లో విచారణ దశలోనే ఉంటే తమకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Road Accident: ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
Buddhist Stupa: అపురూప శిల్ప సంపద.. అణువణువునా బౌద్ధం ఆనవాళ్లు