AP News: అబ్రకదబ్ర... పరిహారం అక్రమార్కుల పరం
ABN , Publish Date - Dec 27 , 2025 | 09:09 AM
తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టులకు సంబంధించి పరిహారం అక్రమార్కుల పరం అవుతోందనే విమర్శలొస్తున్నాయి. కలివికోడి ప్రాజెక్టు, తెలుగుగంగ కాల్వ పనులకు సంబంధించి వైసీపీ నాయకులు పరిహారం పోగేసుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.
- కలివికోడి, తెలుగుగంగ కాల్వ పరిహారం అక్రమార్కుల పరం
- ఒరిజినల్ డీకేటీదారుల పేరిట నకిలీలు ఎంట్రీ
- కలెక్టర్ విచారణతో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి
- న్యాయస్థానానికి నివేదిక అందజేత
- ఖజానాకు కన్నం వేసే ఎత్తుగడకు చెక్
జిల్లాలో తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ముసుగులో కొందరు నేతలు కోట్లాది రూపాయలు కొట్టేశారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు సృష్టించి డబ్బు లాగేసుకుని అటు అధికార యంత్రాంగం, ఇటు నేతలు రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఇదే తరహాలో అట్లూరు మండలంలోని కలివికోడి ప్రాజెక్టు, తెలుగుగంగ కాల్వ పనుల్లో వైసీపీ హయాంలో పరిహారం పోగేసుకునే ప్రయత్నం చేశారు. కలివికోడి పేరిట పరిహారంలో అక్రమాలు జరుగుతున్నాయని పత్రికల్లో కథనాలు వచ్చినా అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు. అయితే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అక్రమాలకు చెక్ పెట్టారు. కలివికోడి పేరుతో జరుగుతున్న ఖజానా దోపిడీకి కళ్లెం వేశారు.
(కడప-ఆంధ్రజ్యోతి): అట్లూరు మండలంలో కలివికోడి సంరక్షణ ప్రాంతం ఉంది. అలాగే తెలుగుగంగ(Telugu Ganga) కాల్వ ఉన్నాయి. ఈ రెండిటి కోసం భూములు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. అయితే కొందరికి అవార్డు అయిందే కానీ పరిహారం పంపిణీ కాలేదు. దీనిపై అట్లూరు మండలం తంబళ్లగొందికి చెందిన దుంపల సరోజినమ్మ, అన్నారెడ్డి నాగమ్మ, నిమ్మకాయల వెంకటసుబ్బమ్మ, నాగెళ్ల పార్వతమ్మ, అన్నారెడ్డి నారాయణరెడ్డి, కావేటి మద్దిలేటిు హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు ఆదేశించినా వీరికి పరిహారం పంపిణీ కాకపోవడంతో వీరు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు ధిక్కరణగా భావించిన న్యాయస్థానం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో అట్లూరుకు చెందిన మునిరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ న్యాయవాది ప్రణీత్‌ను బెదిరించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు కలెక్టరు డాక్టర్ చెరుకూరి శ్రీధర్ జాయింటు కలెక్టర్, బద్వేలు ఆర్డీవోను విచారణకు ఆదేశించారు.

దిమ్మతిరిగే వాస్తవాలు
విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటికి వచ్చాయి. వాస్తవానికి వీరికి ప్రభుత్వం ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. అయితే పేరు మార్చి ఆలి యాస్, ఉరఫ్ అని చెప్పి నకిలీలు సృష్టించారు. ఈ విషయాలు విచారణలో వెల్లడయ్యాయి. అట్లూరు మండలంలోని గుజ్జుల సరోజనమ్మ హైకోర్టులో దాఖలు చేసిన డబ్ల్యుపీ 31740/2018కు సంబం ధించి కంటెమ్డ్ కేసు 4046/2023లో అవార్డులో వ్యత్యాసాలు గుర్తించారు. గుజ్జులవారిపల్లె సర్వే నెం.348/1, 348/2లో మరికొన్ని సర్వే నెంబర్లలో మొత్తం కలిసి 29.47 ఎకరాలు తెలుగుగంగ ప్రాజెక్టు కుడికాల్వ, కలివికోడి పరిరక్షణ కోసం రెజ్యుమ్ చేశారు. తమ భూముల్లో చెట్లు, బోర్లు, నిర్మాణాలకు పరిహారం చెల్లించాలంటూ దుంపల సరోజమ్మ కోర్టును ఆశ్రయించారు. దీనిపై అధికారులు విచారణ చేయగా పరిహారం కోసం ఆమె గుర్తింపు కార్డులు అందించింది.
వ్యక్తి ఒక్కరే.. ఒక్కోచోట ఒక్కో పేరు
- దుంపల సరోజమ్మ అట్‌ది రేట్ ఆఫ్ సరోజమ్మ వైఫ్‌ఆఫ్ రాజారెడ్డి అట్‌ది రేట్ ఆఫ్ మద్దయ్య కోర్టును ఆశ్రయించారు. వాస్తవంగా డీకేటీ రిజిస్టరు ప్రకారం సరోజమ్మ వైఫ్‌ఆఫ్ మాధవయ్య పేరిట భూమి ఉంది. వీరి ఆధార్‌కార్డులు, ఇతర కార్డులను పరిశీలించిన తరువాత ఇది డూప్లికేట్ అని తేలింది. తంబళ్లగొంది సచివాలయంలో ఆమె పేరు దుంపల సరోజనమ్మ మాత్రమే ఉంది.
- మరో పిటిషనర్ నాగెళ్ల పార్వతమ్మ అట్‌ది రేట్ ఆఫ్ సుబ్బమ్మ డాటర్ ఆఫ్ లేట్ నారాయణ వైఫ్ ఆఫ్ నాగెళ్ల పెద్దసుబ్బారెడ్డి. డీకేటీ రిజిస్టరులో వాస్తవంగా భూమి ఉండేది ఎం.పార్వతమ్మ వైఫ్ ఆఫ్ నారాయణ. ఇక ఆధార్ కార్డులో నాగెళ్ల సుబ్బమ్మ వైఫ్ ఆఫ్ నాగెళ్ల పెద్దసుబ్బారెడ్డి, బియ్యం కార్డులో నాగెళ్ల పెద్ద సుబ్బారెడ్డి హెచ్‌వో నాగెళ్ల సుబ్బమ్మ, బ్యాంకు అకౌంటులో నాగెళ్ల సుబ్బమ్మ, వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి, ఓటరు ఐడీలో సుబ్బమ్మ నాగెళ్ల వైఫ్ ఆఫ్ సుబ్బారెడ్డి, లబ్ధిదారుల జాబితాలో నాగెళ్ల సుబ్బమ్మ అని ఉంది.
ఇదిగో సాక్ష్యం...
ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు ముసలిగాండ్ల జకరయ్య సన్నాఫ్ యోహాన్. అట్లూరు మండలం, లింగాలకుంట. ఈయన భూమి తెలుగుగంగ కాల్వలో మునిగిపోవడంతో రూ.3,69,104 పరిహారం ఇచ్చారు.

ఈ ఫొటోలో ఉన్నతని పేరు కూడా ముసలిగండ్ల జకర య్య సన్నాఫ్ జకరయ్య, బద్వే లులోని విద్యానగర్ వాసిగా చూపించారు. రూ.4,61,381 పరిహారం మంజూరైంది. ఫొటోలు, తండ్రి పేరు మార్చారు. ఆధార్ కార్డు మాత్రం రెండింటికీ ఒకటే చూపించారు. 8255 0333 2053. ఈ రెండు ఉదాహరణలు చాలు.. అటు కలివికోడి, ఇటు తెలుగుగంగ కాల్వ పరిహారంలో ఎంత బొక్కేశారో చెప్పడానికి.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..
3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
Read Latest Telangana News and National News