Kollu Ravindra Fires on Perni Nani: పేర్ని నాని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:24 PM
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై అసత్యప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కృష్ణా, సెప్టెంబరు14 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పేర్ని నానిపై (Perni Nani) మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం భూములపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవస్థానం భూములపై ఇటీవల దుష్ప్రచారానికి దిగింది వైసీపీ. దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. పేర్ని నాని ఆరోపణలను తిప్పికొట్టారు మంత్రి కొల్లు రవీంద్ర.
ఇవాళ (ఆదివారం) మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామిని (Machilipatnam Venkateswara Swamy Temple) మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం . భక్తుల సమక్షంలో రూ.45లక్షల లీజు చెక్కు అందజేశారు. చెక్కు అందజేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గొల్లపూడిలో నేషనల్ హైవే పక్కన 40 ఎకరాల దేవస్థానం భూమిని.. రూ.5కోట్లతో విజయవాడ ఉత్సవ కమిటీ అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.
మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చిందని ఉద్ఘాటించారు. దేవస్థానం భూములు ఎవ్వరికీ బదలాయింపు జరగడం లేదని స్పష్టం చేశారు. కేవలం విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav) నిర్వహించడానికే 56 రోజుల పాటు లీజుకు ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. దీని ద్వారా దేవస్థానానికి రికార్డు స్థాయిలో రూ.45 లక్షల ఆదాయం సమకూరిందని నొక్కిచెప్పారు. కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులను కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవస్థానం భూములు అన్యాక్రాంతం కావని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ దేవస్థానానికి ఈ భూముల ద్వారా మరింత ఆదాయం వచ్చేలా కృషి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
దేవస్థానం భూములను లీజుకు తీసుకున్నాం: ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ ఉత్సవ్ నిర్వహణ కోసమే దేవస్థానం భూములను లీజుకు తీసుకున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shivnath) వెల్లడించారు. అది కూడా దేవస్థానానికి భారీ ఆదాయం వచ్చేలా విజయవాడ ఉత్సవ కమిటీ నిర్ణయం తీసుకుందని వివరించారు. 56 రోజులకు రూ.45లక్షల లీజు మొత్తం స్వామివారి సన్నిధిలో ఇచ్చామని తెలిపారు. తాము వేంకటేశ్వరస్వామి భక్తులమని .. ఎలాంటి తప్పు చేయమని ఉద్ఘాటించారు ఎంపీ కేశినేని శివనాథ్.
పార్లమెంట్ సమావేశాలు, ఉప రాష్ట్రపతి ఎన్నిక ఉండటంతో కొంత మిస్ కమ్యూనికేషన్ అయిందని చెప్పుకొచ్చారు. మసులా బీచ్ ఫెస్టివల్ స్ఫూర్తితో విజయవాడ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలంతా ఈ ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రతి సంవత్సరం వేసవిలో మసులా బీచ్ ఫెస్టివల్.. దసరాకి విజయవాడ ఉత్సవ్ నిర్వహించి తీరుతామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
నవయువతకు ప్రేరణ.. అబ్బురపరుస్తున్న దుర్గేశ్ విన్యాసాలు
Read Latest Andhra Pradesh News and National News