AP Mega DSC Recruitment: డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ABN , Publish Date - Sep 14 , 2025 | 08:43 AM
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ ముగింపు దశకు చేరుకుంది. డీఎస్సీ-2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ఖరారయ్యాయి.
1074 పోస్టులకు అభ్యర్థుల ఖరారు!
శాఖల వారీగా జాబితాలు అప్రూవల్‌కు పంపిన విద్యాశాఖ
15న అధికారికంగా తుది ఎంపిక
జాబితాల విడుదలకు సన్నాహాలు
19న వెలగపూడిలో భారీ సభ...
అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత
అభ్యర్థులను విజయవాడ తరలించేందుకు
ఏలూరులో ఏర్పాట్లపై కసరత్తు
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ (AP Mega DSC Recruitment) ముగింపు దశకు చేరుకుంది. డీఎస్సీ-2025 ఉపాధ్యాయ ఉద్యోగాలకు తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలు ఖరారయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నోటిఫై చేసిన మొత్తం 1074 పోస్టులకు మెరిట్ కం రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా జిల్లాలకు సంబంధించి తుది ఎంపికలను రాష్ట్రస్థాయిలోనే పూర్తిచేసి, జాబితాలను డీఈవోలకు అందజేశారు.
ఏలూరు అర్బన్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖలో 1035 పోస్టులు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 32, జువనైల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పాఠశాలలో 7 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలు జిల్లా విద్యా శాఖకు అందాయి. వీటిని శనివారం మరో దఫా పరిశీలించి సంబంధిత శాఖల జిల్లా అధికారుల అప్రూవల్ నిమిత్తం పంపించారు. మున్సిపల్ పోస్టులకు రాజమహేంద్రవరంలోని పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్, జిల్లా పరిషత్ పోస్టులకు డీఈవో/జడ్పీ సీఈవో, గిరిజన సంక్షేమ శాఖ పోస్టులకు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, జువనైల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ పోస్టులకు సంబందిత శాఖ జిల్లా అధికారి సంబంధిత జాబితాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది.
ఆ వెంటనే డీఎస్సీ కన్వీనర్, ఉమ్మడి జిల్లా డీఈవో సంబందిత శాఖల జిల్లా హెచ్‌వోడీలు సంతకాలు చేసిన జాబితాలపై తుది ఆమోదానికి కాకినాడ ఆర్జేడీ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌కు సమర్పిస్తారు. ఇవన్నీ ఆదివారంలోగా పూర్తికావాల్సి ఉంది. ఆ తర్వాత డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లను ఆయా యాజమాన్యాల వారీగా సోమవారం అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న వెకెన్సీలకు పోస్టింగ్స్ కేటాయింపుపై 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్‌ను స్వీకరించి, 19న అపాయింట్ మెంట్ లెటర్లు జారీ చేస్తారు. నియామక పత్రాలు పొందిన కొత్త టీచర్లు వారికి కేటాయించిన పాఠశాలల్లో 20, 21 తేదీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 22 లేదా 23 నుంచి దసరా సెలవుల్లో శిక్షణ ఉంటుంది. దీనిపై ఇంత వరకు విద్యాశాఖ నుంచి ప్రకటనేదీ లేదు.
వసతికి స్కూల్స్‌లో ఏర్పాట్లపై డైలమా..
ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన ప్రతి అభ్యర్థితోపాటు సహాయకు లుగా మరొకరిని వెంటబెట్టుకుని విజయవాడలో ఈ నెల 19న నిర్వహించ నున్న నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి తీసుకెళ్లేలా జిల్లాలో ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను విజయవాడకు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఏలూరు కేంద్రంగానే జరగాలని స్పష్టం చేశారు. దీనికను గుణంగానే ఏలూరులో అభ్యర్థులు, వారి వెంట ఒక సహాయకుల వంతున మొత్తం 2150 మందికి సరిపడా 18వ తేదీ సాయంత్రం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు భోజనం, అల్పాహారం, నిద్రించడానికి వసతి సౌకర్యాలను కల్పించాల్సి ఉంది.
అభ్యర్థులను విజయవాడ తీసుకు రావ డానికి మొత్తం 50 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే సమకూర్చింది. అభ్యర్థులందరికీ కళ్యాణ మండపాల్లో వసతి సౌకర్యం కల్పించడానికి జిల్లా విద్యాశాఖ తొలుత ప్రయత్నాలు చేసింది. ఫంక్షన్ హాళ్లలో గంటకు రూ.10 వేలు చొప్పున అద్దె చెల్లించాలని నిర్వాహకులు తేల్చిచెప్పడంతో, ఆర్థిక భారం దృష్ట్యా ఏలూరులోని 9 పాఠశాలలను ఎంపిక చేసింది. ఒకవేళ ప్రభుత్వం నిధులు విడుదల చేసినా ఈ ఫంక్షన్ హాళ్లలో తగినన్ని టాయి లెట్లు లేవని విద్యాశాఖ అధికారులు గుర్తించి, వాటికంటే ఈ పాఠశాలలే బెటరని అభిప్రాయానికి వచ్చి నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ పాఠశాలల తరగతి గదుల్లో ఫర్నిచర్‌ను వేరేచోటకు మార్చడంతోపాటు, ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం 18, 19 తేదీల్లో తరగతుల నిర్వహణ సాధ్యం కాదని భావిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని 48 మండలాల ఎంఈవోలు, వ్యాయామ విద్య ఉపాధ్యాయులందరినీ 18, 19 తేదీల్లో అందుబాటులో ఉండేలా విధులు కేటాయించడానికి ఏర్పాట్లు జరుగుతు న్నాయి. ఇదే విషయమై డీఈవో వెంకట లక్ష్మమ్మ శనివారం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను 19న విజయవాడ తీసుకెళ్లేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏలూరులో ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఉద్యోగాలు పొందిన వారికి దసరా సెలవుల్లో శిక్షణ ఉంటుందన్నారు.
ఏక కాలంలో నియామక పత్రాల పంపిణీ?
మెగా డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాలకు తుదిగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను సోమ లేదా మంగళవారాల్లో విద్యాశాఖ మంత్రి లోకేశ్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 19న వెలగపూడిలో నిర్వహించనున్న భారీ సభలో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. డీఎస్సీకి ఎంపికైన 16 వేల మంది అభ్యర్థులతోపాటు, వారి సహాయకులు మొత్తం 32 వేల మందితోపాటు, కూటమి ప్రభుత్వంలోని పార్టీలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిదులు, పార్టీల శ్రేణులు కలిపి సుమారు లక్ష మంది ఈ సభకు హాజరవుతారని సమాచారం. రాగల కొద్దిరోజుల్లోనే ఈ ఏర్పాట్లపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా గతంలో సీఎంగా చంద్రబాబు అదికారంలో ఉన్న సమయంలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించిన మాదిరిగానే ఈ దఫా కూడా నియామకపత్రాల అందజేత ప్రక్రియ ఉండవచ్చునని తెలుస్తోంది. అభ్యర్థులకు పోస్టింగ్స్ కేటాయించే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఏపీలో అమానుషం.. బీ ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య
ఆయేషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు
Read Latest Andhra Pradesh News and National News