Savitha On Cyclone: మొంథా తుపానుతో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకి మంత్రి సవిత కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:11 PM
మొంథా తుపానుతో అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. తుపాను దృష్ట్యా చేపట్టే చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు 24 గంటలూ హాస్టళ్లలో ఉండాల్సిందేనని ఆజ్ఞాపించారు మంత్రి సవిత.
అమరావతి, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): మొంథా తుపాను(Cyclone Montha)తో అప్రమత్తంగా ఉండాలని ఏపీ మంత్రి సవిత (Minister Savitha) ఆదేశాలు జారీ చేశారు. బీసీ హాస్టల్ వార్డెన్లు, గురుకులాల ప్రిన్సిపాళ్లతో మంత్రి సవిత ఇవాళ (ఆదివారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను దృష్ట్యా చేపట్టే చర్యలపై దిశానిర్దేశం చేశారు. వార్డెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు 24 గంటలూ హాస్టళ్లలో ఉండాల్సిందేనని ఆజ్ఞాపించారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, తాజా ఆహారం మాత్రమే ఇవ్వాలని సూచించారు మంత్రి సవిత.
టార్చిలైట్లు, క్యాండిల్స్, అగ్గిపెట్టెలు ముందు జాగ్రత్తగా సమకూర్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ల ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాల్సిందేనని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని హాస్టళ్ల విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే సమీప వైద్యులతో వైద్యసేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. నిరంతరం పర్యవేక్షించాలని బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ మల్లికార్జున, ఎంజేపీ స్కూల్ కార్యదర్శి మాధవీలతకు మంత్రి సవిత ఆదేశాలు జారీ చేశారు.
ఏలూరు జిల్లాలో మొంథా తుపాను పరిస్థితిపై మంత్రి పార్థ సారథి ఆదేశాలు

మరోవైపు.. ఏలూరు జిల్లాలో మొంథా తుపాను పరిస్థితిపై ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్‌లతో మంత్రి కొలుసు పార్థసారథి ఇవాళ(ఆదివారం) తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి అధికారులు సంసిద్దంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు మంత్రి కొలుసు పార్థసారథి.
తీవ్రమైన గాలులు, భారీ వర్షాలకు హోర్డింగ్‌లు, స్తంభాలు వంటివి నెలకొరిగే అవకాశం ఉన్నందున భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షించాలని ఆజ్ఞాపించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొంటానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్
పరకామణి వ్యవహారంలో నిందితులను వదిలిపెట్టం.. భానుప్రకాష్ వార్నింగ్
Read Latest AP News And Telugu News