AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ
ABN , Publish Date - Aug 06 , 2025 | 09:53 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. 12 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది.
అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన ఇవాళ(బుధవారం) ఏపీ సచివాలయంలో కేబినెట్ (AP Cabinet Meeting) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రి మండలితో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. 12అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఈ పథకం అమలుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 2024 నుంచి 2029కి ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్ (లిప్ట్) పాలసీ 4.0పై కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అలాగే 22 ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ హోటళ్లు, ఆరు క్లస్టర్ల పరిధిలోని రిసార్టుల ఆపరేషన్లకు సంబంధించి ఏజెన్సీల ఎంపికకు వీసీ అండ్ ఎండీకి అనుమతులు మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి రూరల్ మండలం పేరూరులో 25 ఎకరాల భూమికి బదులుగా గతంలో ఓబెరాయ్ హోటళ్ల గ్రూపు నిర్మాణానికి ఇచ్చిన టీటీడీ ల్యాండ్ బదిలీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎస్‌బీఐ, యూబీఐ బ్యాంకులకు రూ.900 కోట్లు గ్యారెంటీని పవర్ సెక్టార్‌కు ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
హెయిర్ కటింగ్ సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను 150 యూనిట్ల నుంచి 200 యూనిట్లకు పెంచే అంశంపై మంత్రిమండలిలో ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీఎస్సీడీసీఎల్, ఏపీసీపీ డీసీఎల్‌లకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వరసగా రూ.3,545 కోట్లు, రూ.1029 కోట్లు మంజూరు చేసిన రుణానికి గానూ ప్రభుత్వ గ్యారెంటీపై కేబినెట్ చర్చించనుంది. పాఠశాల విద్యలో పలు జీవోలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కాంప్రీహెన్సివ్ ఏపీ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025కు కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు) దాని అనుభంద సంస్థలు, రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్‌లపై మరో ఏడాదిపాటు నిషేధం పొడిగిస్తూ మంత్రిమండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. పుట్టపర్తి, మొవ్వ, గన్నవరం, గాజువాక, తిరుపతిలో 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు రెగ్యులర్ బేసిస్ మీద పోస్టుల క్రియేషన్‌కు కేబినెట్‌లో చర్చించి, ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్కాతమ్ముళ్లను కలిపిన ఆంధ్రజ్యోతి
25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
For More AP News and Telugu News