Cyclone Montha: జెట్ స్పీడులో దూసుకొస్తున్న మొంథా తుపాను.. అధికారులు అలర్ట్
ABN , Publish Date - Oct 27 , 2025 | 09:17 PM
నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 420కిలోమీటర్ల, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
అమరావతి, అక్టోబరు27 (ఆంధ్రజ్యోతి): నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను (Cyclone Montha) గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ (Prakhar Jain) తెలిపారు. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 420 కిలోమీటర్ల, విశాఖపట్నానికి 450 కిలోమీటర్లు, కాకినాడకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
మొంథా తుపాను ఉత్తర - వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రేపు(సోమవారం) ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడుతుందని చెప్పుకొచ్చారు. రేపు సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని తుపాను దాటే అవకాశం ఉందని వివరించారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో రేపు కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అత్యంత భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు ప్రఖర్ జైన్.
మొంథా తుపాను 233 మండలాల్లోని 1419 గ్రామాలు , 44 మున్సిపాలిటీల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే 2194 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఆయా జిల్లాల యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 3,465 మంది గర్భిణులు, బాలింతల సంరక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు ప్రఖర్ జైన్.
స్టేట్ కంట్రోల్ రూమ్ (1), జిల్లా కంట్రోల్ రూమ్(19), రెవెన్యూ డివిజన్‌లలో (54), ఆయా మండల, గ్రామాల్లో కంట్రోల్ రూమ్‌లు (484) మొత్తంగా 558 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఎలాంటి సహాయం కోసమైనా కంట్రోల్ రూమ్స్‌ని 24/7 సంప్రదించవచ్చని సూచించారు. కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం 16 శాటిలైట్ ఫోన్లు, 35 DMR సెట్లు, ఇతర పరికరాలు జిల్లాల్లో అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ యంత్రాంగం ప్రజలతో ఉందని.. ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని సూచించారు. సహాయక చర్యల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 12 ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందాలు జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటలకు విశాఖపట్నం రూరల్ 92.5 మిల్లిమీటర్లు, కాపులుప్పాడలో 85.5 మిల్లిమీటర్లు, మధురవాడలో 83.5 మిల్లీమీటర్లు, సీతమ్మధారలో 81.2మిల్లీమీటర్లు, 63 ప్రాంతాల్లో 50మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలో రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దు.. పాలక మండలి విజ్ఞప్తి
మొంథా తుపానుపై పవన్ కల్యాణ్ అలర్ట్.. అధికారులకు దిశానిర్దేశం
Read latest AP News And Telugu News