PVN Madhav VS Rahul Gandhi: రాహుల్ గాంధీ అబద్దాలు సృష్టిస్తున్నారు.. పీవీఎన్ మాధవ్ ఫైర్
ABN , Publish Date - Sep 01 , 2025 | 10:41 AM
కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
రాజమండ్రి, సెప్టెంబర్1, (ఆంధ్రజ్యోతి): బీహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) తల్లి పట్ల నీచంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలను సమాజం కచ్చితంగా తిప్పి కొడుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆందోళన చెంది ప్రతిరోజూ అబద్దాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు పీవీఎన్ మాధవ్.
ఓటు చోరీ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన రాహుల్ గాంధీ.. ఏ విషయాన్ని బయట పెట్టలేకపోయారని విమర్శించారు. ఇవాళ(సోమవారం) రాజమండ్రిలో పీవీఎన్ మాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సారథ్యం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల్లో పర్యటించానని తెలిపారు. ఈరోజు(సోమవారం) తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్నానని చెప్పుకొచ్చారు. అత్యంత ప్రాశస్త్యం, తెలుగు భాషకు పుట్టినిల్లు, కందుకూరి వీరేశలింగం లాంటి వ్యక్తులు నడయాడిన నేల రాజమహేంద్రవరానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఉద్ఘాటించారు పీవీఎన్ మాధవ్.
సాహిత్య స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ అనేక చోట్ల సారథ్యం కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. రాజమండ్రి పుష్కరాలకు టూరిజం పరంగా ఇప్పటికే కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, సీఎం చంద్రబాబు టూరిజం ఆధ్వర్యంలో ఢిల్లీలో కూడా సమావేశం నిర్వహించారని గుర్తుచేశారు. కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాజమండ్రి పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని వెల్లడించారు. రాజమండ్రి హేవ్ లాక్ బ్రిడ్జి పర్యాటక అభివృద్ధికి రూ. 147 కోట్లు మంజూరయ్యాయని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు.. నవ్యాంధ్ర ప్రగతికి తొలిబాట వేసిన కార్యశూరుడు: ధూళిపాళ్ల నరేంద్ర
మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం
For More AP News And Telugu News