Dhulipalla Congratulates Chandrababu: సీఎం చంద్రబాబు.. నవ్యాంధ్ర ప్రగతికి తొలిబాట వేసిన కార్యశూరుడు: ధూళిపాళ్ల నరేంద్ర
ABN , Publish Date - Sep 01 , 2025 | 09:51 AM
తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దార్శనికుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఉద్ఘాటించారు. 47 ఏళ్లుగా ప్రజా సేవలో తరిస్తోన్న ధన్యుడు చంద్రబాబు అని ప్రశంసించారు.
అమరావతి, సెప్టెంబర్ 1, (ఆంధ్రజ్యోతి): నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టి సోమవారానికి సరిగ్గా 30 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ శ్రేణులు సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (Dhulipalla Narendra Kumar) మీడియాతో మాట్లాడారు.
సీఎం చంద్రబాబు.. 75 ఏళ్ల నవ యువకుడు: ధూళిపాళ్ల
‘75 ఏళ్ల నవ యువకుడు.... 47 ఏళ్లుగా ప్రజా సేవలో తరిస్తోన్న ధన్యుడు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధనకు కంకణబద్దుడు. తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దార్శనికుడు. ప్రజల వద్దకే పాలనకు శ్రీకారం చుట్టిన ఆద్యుడు. యువతకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు. రాజకీయాన్ని రాష్ట్రహితం కోసం అన్వయించిన అపర చాణక్యుడు. సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యుని హితం కోసం వాడిన మేటి నాయకుడు. రాష్ట్రానికి దిక్సూచి... తెలుగు ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శి... మన చంద్రన్న!. దేశం గర్వించే నాయకుడు, పెద్దాయన చంద్రబాబు నాయుడు. తొలిసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ మహా నాయకునికి శుభాకాంక్షలు. చంద్రబాబు లాంటి దేశం గర్వించే నాయకుడి నాయకత్వంలో పని చేయడం మా అందరికీ గర్వ కారణం. అటు పార్టీ, ఇటు ప్రజలే జీవితంగా అనునిత్యం తపించే చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి’ అని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు.
జాతీయ రాజకీయాల్లో శిఖరాగ్ర స్థాయికి టీడీపీ: యనమల రామకృష్ణుడు
జాతీయ రాజకీయాల్లో శిఖరాగ్ర స్థాయికి తెలుగుదేశం పార్టీ చేరుకుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉద్ఘాటించారు. 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అనేది వెన్నుపోటు పొడిచే చర్య కాదని.. ఇది పార్టీలో నాయకుడి మార్పు మాత్రమేనని.. ఇది పార్టీలోని ఒక వ్యవహారమని తెలిపారు. టీడీపీని విధ్వంసకర వ్యక్తులు దుర్మార్గుల బారి నుంచి కాపాడటానికి ఇటువంటి చర్య జరిగిందని చెప్పుకొచ్చారు. 30 సంవత్సరాల క్రితం టీడీపీ పార్టీ దోషుల నుంచి రక్షించబడిందని గుర్తుచేశారు. అందుకే టీడీపీ ఇన్నేళ్లుగా విజయవంతంగా నడుస్తోందని, అజేయంగా మారిందని నొక్కిచెప్పారు. 30 సంవత్సరాల్లో మూడు ఎన్నికల్లో అధికార స్థానాన్ని... మూడు ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని గెలుచుకుందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు టీడీపీని క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడగలరు అనే నమ్మకం అందరికీ ఉందని ఉద్ఘాటించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రిగా ఎంపిక కానందుకు కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచారని యనమల రామకృష్ణుడు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం, మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
మంత్రి నారా లోకేష్‌కు మరో అరుదైన గౌరవం
For More AP News And Telugu News