Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 08:15 AM
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది మంగళవారం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో ఇవాళ, రేపు, ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు, తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు..
హైదరాబాద్, సెప్టెంబర్ 1: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రేపు(మంగళవారం) అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఫలితంగా ఏపీలో సోమ, మంగళ, బుధవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు, తెలంగాణలో కూడా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి.
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజులపాటు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
నేడు(సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. 40 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
నేడు(సోమవారం) కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
వర్షంలో ఆడుతుండగా ఊహించని సంఘటన.. గ్రౌండ్‌లో పడ్డ పిడుగు..
నాటిన చెట్లలో బతికున్న వాటికే గ్రీన్ క్రెడిట్స్