Green Credits: నాటిన చెట్లలో బతికున్న వాటికే గ్రీన్ క్రెడిట్స్
ABN , Publish Date - Sep 01 , 2025 | 07:04 AM
చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన గ్రీన్ క్రెడిట్స్‌ను లెక్కించే పద్ధతిని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సవరించింది. గతంలోలా మొక్కలు నాటిన వెంటనే కాకుండా..
న్యూఢిల్లీ, ఆగస్టు 31: చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన గ్రీన్ క్రెడిట్స్‌ను లెక్కించే పద్ధతిని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సవరించింది. గతంలోలా మొక్కలు నాటిన వెంటనే కాకుండా.. ఐదేళ్లు దాటిన తర్వాత వాటిలో బతికి ఉన్న చెట్ల ఆధారంగా క్రెడిట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2024 ఫిబ్రవరి 22న జారీచేసిన నోటిఫికేషన్‌ను ఈ ఏడాది ఆగస్టు 29న సవరించింది. దీనిప్రకారం గ్రీన్ క్రెడిట్ ప్రోగామ్ కింద ఇకపై క్రెడిట్‌లకు రివార్డులు కూడా ఇవ్వనున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఆయా సంస్థలు, కంపెనీలు స్వచ్ఛందంగా తీసుకున్న చర్యలకు ప్రతిఫలంగా ఇచ్చేవాటిని గ్రీన్ క్రెడిట్స్ అంటారు. సవరించిన నిబంధనల ప్రకారం.. వారు ఉపయోగించిన భూ విస్తీర్ణంలో కనీసం 40ు స్థలంలో చెట్ల పెంపకం చేపట్టిన ఐదేళ్ల తర్వాతే గ్రీన్ క్రెడిట్స్ మంజూరు చేస్తారు. అలాగే వాళ్లు నాటిన మొక్కల్లో కనీసం ఐదేళ్లకుపైగా జీవించి ఉన్న ప్రతి కొత్త చెట్టుకూ ఒక గ్రీన్ క్రెడిట్ కేటాయిస్తారు.