Share News

Nara Lokesh Fires YSRCP: జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు.. మంత్రి నారా లోకేష్ ఫైర్

ABN , Publish Date - Sep 20 , 2025 | 09:43 PM

గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని కూడా జగన్ గ్యాంగ్ దోచుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపణలు చేశారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదల్లేదని ధ్వజమెత్తారు.

Nara Lokesh Fires YSRCP: జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు.. మంత్రి నారా లోకేష్ ఫైర్
Nara Lokesh Fires YSRCP

అమరావతి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ (YSRCP) గజదొంగలు శ్రీవారి సొత్తూ దోచుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆరోపణలు చేశారు. వందకోట్ల పరకా'మనీ దొంగ' వెనుక వైసీపీ నేతలు ఉన్నారని విమర్శించారు. జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. అరాచకం పెచ్చరిల్లిందని.. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేరాఫ్ అడ్రస్‌గా జగన్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్.


శ్రీవారి సొత్తునూ వదల్లేదు..

‘గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్... చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదల్లేదు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు. కోట్ల సొత్తు కొల్లగొట్టారు. ఈ డబ్బు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇందులో వాటాలు తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎంతో నమ్మకంతో కట్టిన ముడుపులు, హుండీలో వేసిన కానుకలు వందల కోట్లు రవికుమార్ దోచుకుని వెళ్లినప్పుడు టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి.. అతని మనుషులు ఏకంగా ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడానికి ప్రయత్నించారు’ అని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు.


శ్రీవారికి చేయని అపచారం లేదు..

‘అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూని సైతం కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు. ఏడుకొండల జోలికి వెళ్లవద్దని, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దని.. నాడు జగన్ మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారు చంద్రబాబు.. అయినా వినలేదు. ఏడుకొండలవాడు చాలా పవర్ ఫుల్ స్వామి.. ఆయనకు అపచారం తలపెట్టినా, ఆయన సన్నిధిలో అవినీతికి పాల్పడినా ఏం జరుగుతుందో తెలిసినా.. జగన్, భూమన ఏకంగా పరకామణినే దోచేశారు. గుడి, గుడి హుండీని దోచేసిన పాపాల గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను: సీఎం చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 20 , 2025 | 10:03 PM