మరో మూడు గంటల్లో పిడుగుపాటు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరిక జారీ
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:22 PM
ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే మూడు గంటల వ్యవధిలో పిడుగులు, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అమరావతి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరిక జారీ చేశారు. రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిడుగుపాటు ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
వాతావరణ హెచ్చరిక వివరాలు
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేశారు. రాగల మూడు గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
గాలుల తీవ్రత
ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గాలుల ప్రవహంతో చెట్లు కూలడం, విద్యుత్ అంతరాయం వంటి ప్రమాదాలు ఉండవచ్చని హెచ్చరించారు.
ప్రజలకు సూచనలు
ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఆశ్రయం పొందవద్దని సూచించారు. రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు పొలాల్లో ఉంటే వెంటనే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని అన్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రయాణాలు తగ్గించాలని తెలిపారు. వర్షం తీవ్రమైతే సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం అనిశ్చితంగా మారిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారితీయొచ్చని హెచ్చరికలో పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పెద్ద దస్తగిరి హత్య వెనక వైసీపీ పెద్దల హస్తం: మంత్రి కొలుసు పార్థసారథి
ఏపీ వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు మరో విద్యా పథకం
విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News