Share News

భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు

ABN , Publish Date - Jul 29 , 2026 | 01:52 PM

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.

 భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
Hyderabad Traffic Advisory

హైదరాబాద్, జులై 29 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ఐటీ కంపెనీలకు ప్రత్యేక సూచనలు చేశారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 3:30 గంటల నుంచి దశలవారీగా ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఒకేసారి వేలాది మంది ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు రావడం వల్ల ప్రధాన రహదారులపై తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఉద్యోగులను విడతలవారీగా కార్యాలయాల నుంచి పంపించాలని కంపెనీలను కోరారు.


భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఒకేసారి భారీగా వాహనాలు రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ మరింత స్తంభించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉద్యోగుల భద్రతతో పాటు నగరంలోని ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.


అలాగే సంస్థలు తమ ఉద్యోగులకు ఎర్లీ లాగౌట్ ఇచ్చే సమయాలను ముందుగానే ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని సూచించారు. దీనివల్ల ట్రాఫిక్ నిర్వహణను సమర్థంగా చేపట్టేందుకు వీలు అవుతుందని తెలిపారు. వర్షాల సమయంలో అత్యవసర ప్రయాణాలు మినహా అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలను క్రమం తప్పకుండా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని నగరవాసులకు అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంట్లో రెండు పార్టీలు: భువనేశ్వరి

సూర్యుడు.. మేడిన్‌ చైనా!

ఎర్రబస్సూ రాదన్నారు.. ఎయిర్‌బస్సు వచ్చేస్తోంది!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 02:07 PM