బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
ABN , Publish Date - Aug 29 , 2026 | 06:43 AM
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్, అమరావతి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులతో ఉత్తరాంధ్రలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేశారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లోనూ సెప్టెంబర్ 2వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కనిపిస్తుండగా.. ఈరోజు, రేపు మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతులు వ్యవసాయ పనులు, పంటల సంరక్షణ విషయంలో వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు
ఇక తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరానికి కూడా మరో 24 గంటల పాటు వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణంతో పాటు అడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాహనదారులు వర్షం సమయంలో జాగ్రత్తగా ప్రయాణించాలని అన్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదు: సీఎం చంద్రబాబు
ఏపీ అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: రామ్మోహన్
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
Read Latest AP News And Telangana News And National News
And Telugu News