Share News

నిప్పుల కొలిమిలా ఏపీ.. మాడు పగిలేలా భానుడి భగభగలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 06:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విడుదల చేసిన తాజా హెచ్చరికల ప్రకారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వడగాలుల తీవ్రత అధికంగా ఉండవచ్చని హెచ్చరించారు.

నిప్పుల కొలిమిలా ఏపీ.. మాడు పగిలేలా భానుడి భగభగలు
AP Heat Wave

అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి):  ఆంధ్రప్రదేశ్‌లో భానుడు (AP Heat Wave) భగభగలాడుతున్నాడు. ఎండ తీవ్రతకు తోడు ఉక్కపోతతో జనం అల్లాడిపోతుండగా, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


తీవ్ర వడగాల్పుల హెచ్చరిక

ఏపీవ్యాప్తంగా ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గాలిలో వేడి పెరిగి తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈరోజు (శుక్రవారం) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. కర్నూలు జిల్లా నగరదోనలో 43.7 డిగ్రీలు నమోదైందని చెప్పారు. రాష్ట్రంలోని సుమారు 207 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించారు.


ఆ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు..

రేపు (శనివారం) ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని, పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది ఉష్ట్రోగ్రతలు పెరిగిపోతున్నాయని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే హెచ్చరికలను గమనిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చని సూచించారు.


ప్రజలకు సూచనలు..

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రఖర్ జైన్ ఈ జాగ్రత్తలు పాటించాలని కోరారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం ఉత్తమమని తెలిపారు. దాహం వేయకపోయినా తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాని సూచించారు. లేత రంగు గల నూలు (కాటన్) దుస్తులు ధరించాలని అన్నారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా తలకు రుమాలు కట్టుకోవాలని చెప్పారు. వడదెబ్బ తగిలినట్లు అనిపిస్తే (తల తిరగడం, వాంతులు, అధిక జ్వరం) వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించాలని సూచించారు. పిల్లలు, వృద్ధులపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 24 , 2026 | 07:05 PM