ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
ABN , Publish Date - Apr 22 , 2026 | 06:55 PM
అనంతపురం నగరంలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సంపన్న వర్గాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వ్యవహరించిన తీరుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అనంతపురం జిల్లా, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): అనంతపురం నగరంలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సంపన్న వర్గాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వ్యవహరించిన తీరుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా, బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం వ్యవహారం వెనుక ఒక ముఠా మాత్రమే కాకుండా కొంతమంది పోలీసు అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడం మరింత సంచలనం సృష్టిస్తోంది.
హనీట్రాప్ ముఠా పక్కా ప్లాన్..
ఈ ముఠా అత్యంత వ్యూహాత్మకంగా సంపన్న వర్గాలు, కాంట్రాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటోంది. మొదట మహిళలు 'హస్కీ వాయిస్'తో ఫోన్ చేసి స్వీట్‌గా మాట్లాడుతూ పరిచయం పెంచుకుంటారు. మాటల మధ్యలో ఆకర్షించి, వారిని ఏకాంతంగా కలిసేలా ప్లాన్ చేస్తారు. ఆ సమయంలో అత్యంత చాకచక్యంగా న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీస్తారు. వీడియో తీయగానే ముఠాలోని ఇతర సభ్యులు 'భర్త'గానో, 'అన్న'గానో ఎంట్రీ ఇస్తారు. ‘నా భార్య, చెల్లి జీవితాన్ని నాశనం చేస్తావా?’ అంటూ సదరు వ్యక్తిపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేస్తారు. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలంటే కొంత నగదు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తారు.
పోలీసుల ప్రమేయం.. అసలు ట్విస్ట్!
ఈ కేసులో పోలీసుల తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. నేరగాళ్లను పట్టుకోవాల్సిన వారే వారితో చేతులు కలిపినట్లు ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ముగ్గురు సీఐల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు సీఐలను కర్నూలు డీఐజీకి అటాచ్ చేస్తూ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. హనీట్రాప్ గ్యాంగ్ సభ్యుల మధ్య విభేదాలు వస్తే, ఓ సీఐ స్వయంగా ఫోన్ చేసి కూర్చొని మాట్లాడుకోండని సర్దిచెప్పడం గమనార్హం. పోలీసుల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ఓ కానిస్టేబుల్ ముఠాతో బేరసారాలు సాగించిన ఆడియోలు బయటకు వచ్చినట్లు సమాచారం.
ఈ కేసు బయటపడింది ఇలా..
బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఈ ముఠా వలలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయన వద్ద నుంచి రూ.4.5 లక్షలు వసూలు చేసిన గ్యాంగ్, మరో రూ.10 లక్షలు కావాలని వేధించడంతో బాధితుడు ధైర్యం చేసి అనంతపురం ఎస్పీ జగదీశ్‌ను ఆశ్రయించారు. అనంతపురం నగరంలో ఇప్పటివరకు 8 నుంచి 10 మంది వరకు ఈ ముఠా బాధితులు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు దోచుకున్నట్లు విచారణలో తేలింది. ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ప్రమేయం ఉన్న పోలీసులపై కూడా శాఖాపరమైన విచారణ వేగవంతం చేశారు.
ప్రజలకు సూచనలు..
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే నేరగాళ్లకు సహకరించడం శాఖాపరంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఎస్పీ జగదీశ్ తీసుకుంటున్న కఠిన చర్యలు ఈ హనీట్రాప్ నెట్‌వర్క్‌ను ఎంతవరకు ఛేదిస్తాయో చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
పెద్ద దస్తగిరి హత్య వెనక వైసీపీ పెద్దల హస్తం: మంత్రి కొలుసు పార్థసారథి
ఏపీ వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు మరో విద్యా పథకం
విద్యార్థులకు అస్వస్థత.. అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News