వారికి అక్కెర.. వీరికి అవకాశం
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:13 PM
వరంగల్ నగరంలో రోజురోజుకూ ఫైనాన్స్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారు.
పేదల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులు
రోజు రోజుకూ మితిమీరుతున్న ఫైనాన్స్ దందా
ఆత్మహత్యకు పాల్పడుతున్న బాధితులు
చిన్నాభిన్నం అవుతున్న మధ్యతరగతి కుటుంబాలు
వరంగల్: వరంగల్ నగరంలో రోజురోజుకూ ఫైనాన్స్ వ్యాపారులు చెలరేగిపోతున్నారు. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారు. చట్టవిరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ, సకాలంలో చెల్లించని వారిని మానసికంగా వేధిస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధితులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
పేదల అవసరాలే అవకాశంగా..
ఆస్పత్రి ఖర్చులు, పిల్లల చదువులు, పెళ్లిల్లు, చిరు వ్యాపారాలు చేసుకోవడానికి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. అనేక కొర్రీలు పెడుతున్నాయి. దీంతో పేదలు వారి చుట్టూ తిరగలేక విసుగు చెంది ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు నెలకు నూటికి రూ.3 నుంచి రూ.10వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. వెరసి చివరికి అసలు కంటే వడ్డీలే ఎక్కువవుతున్నాయయి. మరి కొందరు పరపతి సంఘాలు, పొదుపు సంఘాల్లో అర్థరూపాయి, లేదా రూపాయి వడ్డీకి రుణాలు తీసుకొని బయట నెలకు రూ.3 నుంచి రూ.10వరకు వడ్డీలకు ఇస్తున్నారు.
వేధింపులు... ఆస్తుల కబ్జాలు...
ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఆస్తి పత్రాలు తనఖా పెట్టుకొని కొందరు అప్పులు ఇస్తున్నారు. వడ్డీ లేదా అసలు చెల్లింపులో జాప్యం జరిగితే బెదిరింపులకు దిగుతున్నారు. ఇంటి వద్దకు వచ్చి గొడవలు చేయడం, అవమానించడం, ఫోన్లలో బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలతో బాధితులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. పలుచోట్ల అప్పుల పేరిట బాధితుల ఇళ్లకు తాళాలు వేయడం, స్థలాలు, వాహనాలు స్వాధీనం చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ వేధింపులు తట్టుకోలేక బాధితులు ఊర్లు విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
లైసెన్స్ లేని దందా...
మనీ లెండింగ్ చట్టం ప్రకారం వడ్డీ వ్యాపారం నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలి. నిర్దేశించిన వడ్డీ రేట్లకే అప్పు ఇవ్వాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో లైసెన్సులు లేకుండా వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు జంకుతున్నారు.
బలవుతున్న బతుకులు...
అధిక వడ్డీ వ్యాపారుల ఆగడాలు సామన్య ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. అధిక వడ్డీల భారాన్ని మోయలేక పేద, మధ్య తరగతి ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల రంగశాయిపేట ప్రాంతంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక న్యాలపోగుల సంజయ్‌కుమార్ శోభ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదేవిధంగా లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక సోమవారం బొల్లికుంట గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు దిక్కులేనివారయ్యారు.
అవగాహన అవసరం...
పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అవసరాలను అసరాగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్న వడ్డీ వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అదేవిధంగా తక్కువ వడ్డీకే రుణాలు అందేలా బ్యాంకింగ్ వ్యవస్థ, స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అప్పుడే వడ్డీ వ్యాపారుల చెర నుంచి సామాన్యులకు విముక్తి లభిస్తుందని అభిప్రాయపడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News