Share News

మేడారం వనదేవతల సమక్షంలో చేయూత పెన్షన్లకు శ్రీకారం

ABN , Publish Date - Aug 16 , 2026 | 04:40 PM

మేడారం వనదేవతల సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయూత పెన్షన్లకు శ్రీకారం చుట్టారు. చేయూత పెన్షన్ల కొత్త లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. మేడారంలో సీఎం ఆదివారం పర్యటించారు.

మేడారం వనదేవతల సమక్షంలో చేయూత పెన్షన్లకు శ్రీకారం
Telangana CM Revanth Reddy

ములుగు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మేడారం వనదేవతల సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) చేయూత పెన్షన్లకు శ్రీకారం చుట్టారు. చేయూత పెన్షన్ల కొత్త లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. మేడారంలో సీఎం ఈరోజు (ఆదివారం) పర్యటించారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మేడారం అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. గట్టమ్మ ఆలయం దగ్గర పంచాయతీరాజ్‌ శాఖ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం మేడారం నుంచి సీఎం ములుగు, పరకాల వెళ్లారు. పరకాలలో రూ.443.42కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ములుగులో రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.


మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేశాం..

కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.16 ఎకరాల్లో రూ.63 కోట్లతో భవన సముదాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. వనదేవతలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. ఆనాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ములుగు నుంచే తాను పాదయాత్ర ప్రారంభించానని ప్రస్తావించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తీరుస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. రామప్ప దేవాలయంతో సమానంగా మేడారం అభివృద్ధి చేశామని వెల్లడించారు. త్వరలోనే మల్లూరు నరసింహస్వామి ఆలయానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. జంపన్న వాగును కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.


పక్కా ప్రణాళికతో ముందుకు..

ఎన్నికల ముందు రాష్ట్ర నలుమూలలా తిరిగి ప్రతీ గూడేనికి, పల్లెకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం ఓ భరోసా ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. అక్కగా సీతక్క మీ సమస్యల్ని పరిష్కరిస్తోందన్నారు. మేడారం సమ్మక్క సారక్క ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని వివరించారు. ఆడబిడ్డలు, పేదలు, నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందని ఉద్ఘాటించారు. జంపన్న వాగును నూటికి నూరుశాతం అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు.


ఈ ఏడాది మహిళలకు చిలకపచ్చ రంగు చీరలు అందిస్తాం..

ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ కష్టాలు తీరాలంటే ఈ ప్రాంతానికి సాగునీరు రావాలని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష చేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఆదివాసీ బిడ్డలకు సాంకేతిక నైపుణ్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యపై దృష్టి సారించాలని అన్నారు. 12వ తరగతి తర్వాత నైపుణ్య విద్యపై దృష్టి సారించాలని సూచించారు. తమ ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను సారెగా పెట్టామని తెలిపారు. ఈ ఏడాది మహిళలకు చిలకపచ్చ రంగు చీరలను అందిస్తామని తెలిపారు.


ములుగు అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం

ములుగు అభివృద్ధికి ఏం కావాలో చెబితే.. నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. చదువు ఒక్కటే ఉద్యోగాన్ని ఇవ్వదని.. స్కిల్స్ కూడా కావాలని సూచించారు. ఇంటర్ తర్వాత విద్యార్థులు స్కిల్స్ నేర్చుకోవాలని అన్నారు. స్కిల్స్ ఉన్నవారికి జర్మనీ, జపాన్, కొరియాలో మంచి అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు జర్మనీ, జపాన్, కొరియన్ భాషలు నేర్పిస్తామని చెప్పుకొచ్చారు. రక్తం పంచుకుని పుట్టకపోయినా తమ మంత్రి సీతక్కను సొంత ఆడబిడ్డలాగా చూస్తామని తెలిపారు. ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తోందని ఒకరు సొంత చెల్లినే బయటకు నెట్టివేశారని విమర్శించారు. కుమారుడికి బుద్ధి చెప్పాల్సిన తండ్రి ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. బిడ్డకే న్యాయం చేయలేని వారు.. ప్రజలకు న్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడాలని అఘోరా పూజలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ దేవుడు తమవైపు ఉన్నారని.. వర్షాలు కురిపించారని పేర్కొన్నారు. ఇంకొకరు అఘోరారావు అఘోరా పూజలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇబ్బందులు పడాలని కోరుకున్నారని మండిపడ్డారు. మీరు అండగా ఉండండి.. మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం.. మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


హైదరాబాద్‌తో సమానంగా ములుగు అభివృద్ధి: మంత్రి సీతక్క

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ములుగు అభివృద్ధి చెందుతోందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌తో సమానంగా ములుగు అభివృద్ధి సాధిస్తోందని వెల్లడించారు. పదేళ్లుగా కొట్లాడితే 33వ జిల్లాగా ములుగును ఇచ్చారని ప్రస్తావించారు. గత ఎన్నికల ముందే ములుగు కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఏ జిల్లాకు ఇవ్వనన్ని ఇందిరమ్మ ఇళ్లు ములుగుకు తాము ఇచ్చామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 05:10 PM