పోలీస్ జాగిలాల నక నక.. నిధుల కొరతతో అందని పౌష్టికాహారం
ABN , Publish Date - Jun 11 , 2026 | 11:34 AM
సంఘ విద్రోహ శక్తుల నుంచి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు రక్షణ కల్పించడంలో కీలకంగా పనిచేసే పోలీసు జాగిలాలు కడుపునిండా తిండి లేక నకనకలాడుతున్నాయి.
ఒక్కొక్క యూనిట్‌లో 5 నుంచి 11 నెలల ఫుడ్ బిల్లుల పెండింగ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోనే రూ.10 లక్షల బిల్లు పెండింగ్
ఉమ్మడి జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో కలిపి సుమారు రూ.57 లక్షల బకాయిలు
రైస్, ఇతరత్రా ఆహారం పెడుతూ నెట్టుకొస్తున్న వైనం
వరంగల్: సంఘ విద్రోహ శక్తుల నుంచి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు రక్షణ కల్పించడంలో కీలకంగా పనిచేయడంతోపాటు హత్యలతో పాటు దొంగతనాల్లోని నిందితులను పట్టుకోవడంలో పనిచేసే పోలీసు జాగిలాలు కడుపు తిండి లేక నకనకలాడుతున్నాయి. జాగి లాల ఫుడ్‌కు పెట్టిన ఖర్చును ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పోలీస్ వెల్ఫేర్ నుంచి అరకొర పోషకాలతో ఉన్న నాణ్యతలేని ఆహారాన్ని పెడుతూ నెట్టుకుంటూ వస్తున్నట్లుగా విశ్వసనీయమైన సమాచారం.
ప్రముఖ పేరున్న ఓ కంపెనీకి చెందిన ఫుడ్‌ను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, పక్క కమిషనరేట్లు అయిన సిద్ధిపేట, రామగుండం, వికారాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, అదిలాబాద్, సంగారెడ్డికి హనుమకొండ కేంద్రంగా సరఫరా చేస్తుండగా సుమారుగా సుమారు రూ.57 లక్షల బకా యి పెండింగ్‌లో ఉంది. దీంతో డబ్బులిస్తేనే పుడ్ సరఫరా చేస్తామని సరఫరాదారులు అంటుండటంతో చేసేదేమీ లేక అందుబాటులో ఉన్న ఆహారం పెట్టుకుంటూ పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నాణ్యతలేని ఆహారం
గతంలో మూడు నెలల కోసారి బిల్లులను విడుదల చేయడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగిలాలకు న్యూట్రిషన్ పుడ్ లభించేది. ప్రసుత్తం రెండింతలు, మూడింతలు సమయం పెరిగినా ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడంతో ఫుడ్ ఇవ్వడానికి సరఫరాదారులు ముందుకురావడం లేదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుంచి సరఫరాదారులకు రూ.9.55 లక్షల బకాయి ఉంది. దీంతో చేసేదేమీ లేక ఒక బ్యాగ్ పౌష్టికాహారానికి ఇంకొక సాధారణ పుడ్ లేదా వండిన రైస్‌ను కలిపి నెట్టుకొస్తున్నట్లుగా తెలుస్తోంది.
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సీఐడీకి సంబంధించి 4, లా అండ్ ఆర్డర్ పోలీసులకు సంబంధించి 19 జాగిలాలు మొత్తం 23 జాగిలాలు ఉండగా, పోలీస్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాల్ నుంచి వచ్చే ఆదాయం వనరుల నుంచి ఏరోజుకారోజు నాణ్యమైన న్యూట్రిషన్ బ్యాగ్‌లను కొనుగోలు చేసి ఆహారాన్ని పెడుతున్నట్లుగా తెలుస్తోంది. పౌష్టిక ఆహారం లేనిరోజు స్థానికంగా అందుబాటులో ఉన్న ఆహారంతో సర్దుబాటు చేస్తున్నట్లుగా సమాచారం. ములుగు జిల్లాలో 12 జాగిలాలు ఉండగా,
సదరు యూనిట్‌లో గత ఏడాది జూలై నుంచి ఈఏడాది మార్చి వరకు పుడ్‌బిల్లు పెండింగ్‌లో ఉంది. భూపాలపల్లిలో ఉన్న మరో 4 జాగిలాలు ఉండగా, గత ఏడాది మే నుంచి ఈ యేడాది మార్చివరకు పెండింగ్‌లో ఉంది. మహబూబాబాద్‌లోని జాగిలాలపరిస్థితి అదే విధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల సభలు, పర్యటనల్లో కాపాలాకాసే జాగిలాలకు అయ్యే తిండి ఖర్చుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సరైన పౌష్టిక ఆహారం లభించక ఆకలికి కొట్టుమిట్టాడుతూ తల్లడిల్లుతున్నాయి.
ఫుడ్ విషయంలో రాజీలేదు..
సీహెచ్.శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ వింగ్ ఆర్‌ఐ
బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమే. ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, చాలాచోట్ల ఈ పరిస్ధితి ఉంది. అయినా జాగిలాలకు నాణ్యమైన ఆహారం పెట్టడంలో వెనుకాడటం లేదు. సీపీ ఆదేశాలమేరకు యథావిధిగా ఎప్పటిలాగే నాణ్యమైన ఫుడ్‌ను అందిస్తున్నాం. రెగ్యులర్ ఫుడ్ కాకుం డా ఇతర ఏ ఫుడ్‌పెట్టినా జాగిలాలు తీసుకోవు. ఉన్నతాధికారుల దృష్టికి పెండింగ్ బిల్లులు, తద్వారా ఏర్పడుతున్న పరిస్థితులను వివరించాం.
ఈ వార్తలు కూడా చదవండి:
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు
కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేత
Read Latest AP News And Telangana News And International News And Telugu News