Share News

కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేత

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:23 AM

పెట్రోల్ వినియోగదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. అయితే.. అందరూ ఉపయోగించే సాధారణ పెట్రోల్‌కు కాదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఇథనాల్ మిక్స్‌డ్ పెట్రోల్ వినియోగించే వారికి మాత్రమే.

కేంద్రం గుడ్ న్యూస్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ ఎత్తివేత

ఇంటర్నెట్ డెస్క్: ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్‌కు ఈ మినహాయింపు వర్తిస్తుందని అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇంధనాలకు ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా మినహాయించినట్లు అందులో పేర్కొంది.


ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి, దేశీయంగా లభించే బయో ఇంధనాలకు ఊతమివ్వాలనే వ్యూహంతో కేంద్రం ఈ ముందడుగేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. బీఐఎస్ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇథనాల్ పెట్రోల్ మిశ్రమాలకు ఇకపై ఎక్సైజ్ సుంకమేమీ ఉండదు. ఈ రాయితీలతో మార్కెట్లో ఇథనాల్ ఆధారిత ఇంధనాల లభ్యత పెరగడం సహా రానున్న కాలంలో వాహనదారులపై ధరల భారమూ తగ్గే అవకాశముంది. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, స్థానిక రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ మినహాయింపులిచ్చినట్టు తెలుస్తోంది.


అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గత మార్చి నెలాఖర్లో పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్రం. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రికత్తలతో ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు రూ.21.5, విమాన ఇంధనం ఎగుమతులపై లీటర్‌కు రూ.29.5 చొప్పున కేంద్రం సుంకాలు విధించింది. కాగా.. మే 15 నుంచి భారత్‌లో చమురు కంపెనీలు 4 సార్లు ఇంధన ధరలను పెంచిన సంగతి తెలిసిందే.


ఇక.. మొన్నటివరకు శాంతిరాగం వినిపించిన అమెరికా.. ఇరాన్‌పై మళ్లీ దాడులకు దిగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన సంక్షోభం మొదలైంది. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్లపైనా మిసైల్ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరలకు మరోసారి రెక్కలొచ్చే అవకాశముందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

ఢిల్లీలో గురు రంధావా జిమ్‌పై కాల్పులు.. తమ పనేనన్న బిష్ణోయ్ గ్యాంగ్!

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం!

Updated Date - Jun 11 , 2026 | 11:31 AM